29-03-2025 11:48:03 PM
40 మంది కవులతో మనోరంజకంగా సాగిన కవి సమ్మేళనం....
మాగంటి సూర్యం స్ఫూర్తితో కళలను కళాకారులను ప్రోత్సహిస్తున్నాం..
లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల కో డైరెక్టర్ సాయి సూర్య..
భద్రాచలం (విజయక్రాంతి): శ్రీ విశ్వ వాసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు కలలు, కళాకారులను ప్రోత్సహించాలన్న లక్ష్యంతో మాగంటి కళా పీఠం ఆధ్వర్యంలో శనివారం స్థానిక లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆవరణలో నిర్వహించిన కవి గాయక సమ్మేళనం మనోరంజకంగా కొనసాగింది. లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల కో డైరెక్టర్ మాగంటి సాయి సూర్య నేతృత్వంలో నిర్వహించిన ఈ కవి గాయక సమ్మేళన కార్యక్రమానికి సుమారు 40 మంది కవులు, కళాకారులు హాజరై ఉగాది యొక్క ప్రత్యేకతను తెలుగు సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కవితలను తెలుగు భాషా ప్రాముఖ్యతను తెలియపరిచే పద్యాలను పాడి అర్థాలను వివరించి తెలుగు భాష గొప్పతనాన్ని తెలుగు నామ సంవత్సర ప్రత్యేకతను ఉగాదికి ఉన్న విశిష్టతను తెలియపరిచారు.
ఈ కార్యక్రమానికి పర్యావరణ ప్రేమికులు గొల్ల భూపతి రావు అధ్యక్షత వహించగా, విశ్రాంత డిగ్రీ కళాశాల ప్రధానోపాధ్యాయులు తిప్పన సిద్దులు, ప్రముఖ కవిత్రి చిట్టి లలిత లు మాట్లాడుతూ మన తెలుగు సంస్కృతి సంప్రదాయాలను కాపాడే విధంగా మాగంటి కళా పీఠం ఆధ్వర్యంలో లిటిల్ ఫ్లవర్స్ విద్యా సంస్థల వారు ఇటువంటి కవి సమ్మేళనాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా జీవితంలో ఉగాది రుచులదిరిగానే సంతోషాలు సుఖాలు, కష్టాలు, దుఃఖాలు, సమపాలనలో ఉంటాయని తెలియపరచటమే ఉగాది యొక్క ప్రత్యేకత అని అన్నారు.
మాగంటి సూర్యం జీవించిన కాలంలో కళాకారులను కవులను అనేక సందర్భాలలో ప్రోత్సహిస్తూ సాహితీ స్రవంతి, మాగంటి కళాపీఠం లతోపాటు భద్రాద్రి కళావేదికలను ప్రోత్సహిస్తూ మన సంస్కృతి సంప్రదాయాలను తెలిసే విధంగా ఆయన కృషి చేశారని గుర్తు చేశారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన కవులు కళాకారులు వివిధ అంశాలపై తమ కవితలను పాటలను వినిపించగా హాజరైన కవులందరినీ మాగంటి కళాపీఠం ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో పామరాజు తిరుమలరావు,కవి ప్రసాద్ ,యర్రంశెట్టి పూర్ణిమ తదితర కవులు కళాకారులు పాల్గొన్నారు.
మాగంటి సూర్యం గారి స్ఫూర్తితో తెలుగు కళా రంగ అభివృద్ధికి కృషి చేస్తాం.....
మాగంటి సాయి సూర్య
కలల అన్న కళాకారులు అన్న మాగంటి సూర్యంకి అమితమైన ప్రేమ అనురాగాలు ఉండేవని, కళాకారులను ప్రోత్సహించేందుకు లిటిల్ ఫ్లవర్స్ విద్యాసంస్థల ఆవరణలో అనేక కళా సమ్మేళనాలు ఇష్ట గోస్టులు కవితా చర్చ కార్యక్రమాలు నిర్వహిస్తూ కళాకారులను ప్రోత్సహించేవారని లిటిల్ ఫ్లవర్స్ డైరెక్టర్ మాగంటి సాయి సూర్య తెలిపారు. ఎంతోమంది ఏజెన్సీ ప్రాంత కళాకారులను వెలుగులోకి తీసుకువచ్చి వారి ప్రతిభను ప్రపంచానికి తెలిసేలాగా మాగంటి సూర్యం కృషి చేశారని, అంతేకాకుండా ఇతర ప్రాంతాల నుండి కళాకారులను కవులను భద్రాచలం తీసుకువచ్చి వారి ప్రతిభను ఈ ప్రాంత ప్రజలకు పరిచయం చేయడంలో మాగంటి సూర్యం కృషి మరువలేనిదనీ అన్నారు.
మాగంటి కళా పీఠం ఆధ్వర్యంలో అనేక రకాల కళాసేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని. తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలుగు నామ సంవత్సరం యొక్క ప్రత్యేకతను ఉగాది వంటి తెలుగు సంవత్సరాది విశిష్టతను నేటితరం వారికి తెలిసేందుకు ఇటువంటి కవి సమ్మేళనాలు ఉపయోగపడతాయన్న లక్ష్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. సుమారు 40 మంది కవులు కళాకారులు తమ ప్రతిభను ప్రదర్శించి ఉగాది యొక్క విశిష్టతను తెలియజేశారని, భవిష్యత్తులో మాగంటి కళా పీఠం ఆధ్వర్యంలో మరిన్ని కళా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు..