అసలైన కాంగ్రెస్ యూత్ నేతలపై దాడులా...?
బాధితులకు అండగా పొదెం...
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలంటు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
నికార్సైన కాంగ్రెస్ కార్యకర్తలపై దాడి అమానుషం...
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): హైదరాబాద్ గాంధీ భవన్ లో బుధవారం యూత్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, ఘర్షణపై తెలంగాణ రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, భద్రాచలం మాజీ శాసనసభ్యులు పొదెం వీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెందిన యూత్ కాంగ్రెస్ నాయకులను కొందరు కొట్టడం, దాడి చేయటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయనీయమైన చర్య అని ఆయన దుయ్యబట్టారు. సమస్య ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి కానీ, దాడులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. జిల్లా యూత్ కాంగ్రెస్ నేతలపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, దీనిపై పూర్తి విచారణ జరపాలని కోరుతూ 'పొదెం' బాధితులతో కలిసి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇటువంటి చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.