calender_icon.png 14 November, 2024 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమ్మ హాస్పిటల్‌పై పోక్సో కేసు

10-11-2024 12:51:56 AM

మైనర్ బాలికకు అబార్షన్?

సిరిసిల్ల, నవంబర్ 9 (విజయక్రాంతి): ప్రైవేట్ ఆసుపత్రులను వైద్యారోగ్యశాఖ అధికారులు తనిఖీ చేయకపోవడంతో ఇష్టారా జ్యంగా వ్యవహరిస్తున్నారు. అబార్షన్‌లు చేయొద్దనే నిబంధనలు ఉన్నప్పటికీ రెండు నెలల క్రితం సిరిసిల్లలోని అమ్మ హాస్పిటల్‌లో ఓ బాలికకు అబార్షన్ చేసిన విషయం ఇప్పుడు బయటపడటంతో ఆసుపత్రిపై వేములవాడ పోలీస్‌లు పోక్సో కేసు నమోదు చేశారు. రెండు నెలల నుంచి అబార్షన్ విషయం బయటకు రాకుండా ఉందంటే అధికారుల పనితీరు ఎలా ఉందో తెలుస్తోంది.

సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూరుకు చెందిన వ్యక్తి ఓ బాలికను వివాహం చేసుకున్నాడు. బాలికకు గర్భం దాల్చగా తీవ్ర రక్తస్రావం కావడంతో అమ్మ ఆసుపత్రిలో చేర్పించారు. దీంతో ఆసుపత్రి నిర్వాహకులు బాలికకు అబార్షన్ చేశారు. ఈ విషయంపై రెండు నెలల వరకు వైద్య ఆరోగ్యశాఖ అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా గోప్యంగా ఉంచారు. బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇప్పుడు ఆసుపత్రిపై పోక్సో కేసు నమోదైంది.

అధికారులు సక్రమంగా తనిఖీలు చేయకపోవడంతోనే స్కానింగ్ కేంద్రాల్లో లింగ నిర్ధారణ, డెంగ్యూ లేకున్నా ఉన్నట్లు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నట్టు ఆరోపణలున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కనీస నిబంధనలు పాటించపోవడం, సౌకర్యాలు లేకున్నా క్రిటికల్ కేసుల్లో రోగులను చేర్పించుకోవడంతో ప్రాణాలు పోయిన ఘటనలు ఉన్నాయి.