calender_icon.png 29 December, 2024 | 8:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీజుల పేరుతో జేబులు ఖాళీ

17-07-2024 12:05:00 AM

మూడు, నాలుగేళ్ల పసివాడు సంవత్సరం మొత్తం రెగ్యులర్‌గా బడికి వెళ్లినా తెలుగు వర్ణమాల, ఆంగ్లంలో ఆల్ఫాబెట్స్ కూడా సరిగ్గా నేర్చుకోలేడు. నాలుగు అక్షరాలు నేర్పించడానికి లక్షల రూపాయల ఫీజు వసూలు చేయడం ఏమిటని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, మేధావులు ప్రశ్నిస్తున్నారు. ద్వితీయ శ్రేణి కార్పొరేట్ స్కూల్స్, పేరున్న ప్రైవేటు విద్యాసంస్థల వారు ఎల్‌కేజీకి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. తరగతి పెరిగే కొద్దీ ఈ మొత్తం మరింత పెరుగుతునే ఉంది. ఇవిగాక పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, స్కూలు యూనిఫామ్, టై, బెల్టు, సాక్సులు, బ్యాగులు వంటివన్నీ బడిలోనే ఏర్పాటు చేస్తున్నారు. పుస్తకాలకు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. రకరకాల సామాగ్రి పేరిట అదనంగా డబ్బులు గుంజుతున్నారు. పేరున్న విద్యాసంస్థలు బిల్డింగ్ ఫండ్‌ను కూడా వసూలు చేస్తున్నాయి. 

నిబంధనలు ఏం చెబుతున్నాయి?

రాష్ట్ర ప్రభుత్వం 1994లో జీవో నంబర్ 1లో ఒకసారి, 2008లో జీవో నంబర్ 90, 91, 92లలో మరోసారి ప్రైవేటు విద్యాసంస్థలు పాటించాల్సిన నియమ నిబంధనలను పేర్కొంది. ఈ జీవోలలో ఫీజుల నియంత్రణపై స్పష్టమైన ఆదేశాలను ఇచ్చింది. 1994 జీవో నంబర్ 1 ప్రకారం ఫీజులను నిర్ణయించడానికి పాఠశాల చైర్మన్, ప్రిన్సిపాల్, విద్యార్థుల తల్లిదండ్రులు ఇద్దరు, విద్యార్థి సంఘాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలి. వసూలు చేసిన ఫీజుల్లో పాఠశాల యాజమాన్యాలు 5 శాతానికి మించి తీసుకోవడానికి వీలేదు. మిగిలిన ఫీజుల్లో 50 శాతం మొత్తాన్ని టీచర్లకు వేతనాలుగా ఇవ్వాలి. 15 శాతం వరకు పాఠశాల నిర్వహణ విద్యుత్తు, అద్దె ఖర్చులు, 15 శాతం స్కూలు అభివృద్ధికి ఉపయోగించాలి.

15 శాతం ఫీజులు స్కూల్ సిబ్బందికి బీమా, భవిష్యనిధి కోసం కేటాయించాల్సి ఉంటుంది. 2008 జీవో నంబర్ 90, 91, 92 ప్రకారం ఫీజు నిర్ణయించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారి, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి, విద్యార్థి సంఘాలు, ప్రైవేటు విద్యాసంస్థల ప్రతినిధితో కమిటీని ఏర్పాటు చేయాలి. కమిటీ స్థానిక పాఠశాలలను పరిశీలించి మౌలిక సదుపాయాలు, పరిస్థితులను చూసి ఎంత ఫీజు వసూలు చేయాలనే విషయమై నివేదిక ఇస్తుంది. దీనిపై విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రభుత్వపరంగా ఒక ప్రకటన విడుదల చేయాలి. ఈ ఉత్తర్వులను విధిగా అమలు చేయాలి. జీవో 42 ప్రకారం ఫీజులను పెంచాలంటే ‘జిల్లా ఫీజు రెగ్యులేషన్ కమిటీ’ అనుమతి తీసుకోవాలి. ఎలాంటి అనుమతి లేకుండా ప్రతి సంవత్సరం ఫీజులను పెంచడానికి వీలు లేదు.

అందమైన పేర్లతో దోపిడీ

‘శతకోటి దరిద్రాలకు అనంత కోటి ఉపాయాలు’ అన్న తీరుగా కార్పొరేట్ పాఠశాలలు పనిచేస్తున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను ఆకర్షించే విధంగా, తల్లిదండ్రులను మభ్యపెట్టడానికి వివిధ రకాల పేర్లు జోడిస్తున్నారు. సెక్షన్ 8(1) ప్రకారం విద్యాసంస్థల పేర్లకు ఈ టెక్నో, లెర్నింగ్, గ్లోబల్, స్మార్ట్, ఐఐటి, నీట్, ఒలంపియాడ్, కాన్సెప్ట్, ఇంటర్నేషనల్ వంటి పదాలను చేర్చకూడదు. కానీ, వివిధ రకాల విద్యాసంస్థల తోక పేర్లతో పాఠశాలలు అనుమతి లేకుండానే నిర్వహిస్తున్నారు. ఈ పేర్లతో భారీ హోర్డింగులు, బోర్డులతో, బ్యానర్లతో అక్కడక్కడ దర్శనమిస్తున్నాయి.

2009 విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి పాఠశాల యాజమాన్యం ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుల వివరాలను నోటీసు బోర్డులో పెట్టాలి. ప్రతి కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలో 25 శాతం సీట్లను పేదవారికి, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేటాయించి ఉచిత విద్యను అందించాలి. కానీ, ఏ  విద్యాసంస్థ కూడా ఉచిత విద్య అందిస్తున్న దాఖలాలు లేవు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలలో నర్సరీ నుండే వేల రూపాయలు, పదవ తరగతి విద్యార్థులకు అయితే లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నారంటే ఆదాయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. పేద, మధ్యతరగతి తల్లిదండ్రులకు  వచ్చే ఆదాయం చారెడైతే పిల్లల చదువుకు అయ్యే ఖర్చు మాత్రం బారెడు అవుతుంది. 

జీవోలు కాగితాలకే పరిమితం

ప్రైవేట్ విద్యావ్యవస్థపై ప్రభుత్వం నియంత్రణ లేదా? అంటే, ఉందని చెప్పవచ్చు. కానీ, అది జీవోల రూపంలో కాగితాలకే పరిమితమైంది. విద్యాశాఖ అధికారులు ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలకు అనుకూలంగా మారడంతో ప్రభుత్వ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో ప్రైవేటు ఉపాధ్యాయులు శ్రమ దోపిడీకి గురవుతున్నారు. అతి తక్కువ జీతాలతో రోజుకు 10 నుంచి 12 గంటలపాటు విధుల్లో ఉంటున్నారు. సెలవులు విద్యార్థులకేగాని ఉపాధ్యాయులు, సిబ్బందికి కాదన్నట్లుగా యాజమాన్యాలు వ్యవహరిస్తున్నాయి.

అందుకే, చాలా పాఠశాలల్లో ఆదివారాలు , పండుగ సెలవుల్లో కూడా సిబ్బంది, ఉపాధ్యాయులు కనిపిస్తుంటారు. ప్రైవేటు విద్యావ్యవస్థను పరిశీలించాల్సిన కమిటీలన్నీ కాగితాలకు పరిమితమవుతున్నాయి. సంవత్సరానికి చెల్లించే ఫీజుల్లో డిస్కౌంట్ ఆఫర్లు పెడుతున్నారు. పాఠశాల సమీపంలో అద్దెకు గదులు తీసుకుని యధేచ్ఛగా పాఠ్యపుస్తకాలు పాఠశాల సిబ్బందితోనే విక్రయిస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలో ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక తరగతి గది కేటాయించాలి. కానీ, ఒక్కో తరగతి గదికి 50 నుంచి 80 మంది విద్యార్థులను కూర్చోబెడుతున్నారు.

కనిపించని ఆట స్థలాలు

2008లో జీవో నెంబర్ 88 ప్రకారం 200 మంది విద్యార్థులు చదివే పాఠశాలలో 7 చదరపు మీటర్ల విస్తీర్ణంలో క్రీడా మైదానం ఉండాలి. అగ్ని ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలి. అగ్నిమాపక సామాగ్రిని అందుబాటులో ఉంచాలి. కానీ, రాష్ట్రంలో ఏ ఒక్క ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలోనూ అగ్ని ప్రమాద నివారణ చర్యల ఏర్పాట్లు వున్న దాఖలాలు లేవు. కొన్ని పాఠశాలల్లో ఫైర్ సేఫ్టీ అసలే కనిపించదు. ఒకవేళ కనిపించినా అది పని చేయదు. ఒక్కొక్క తరగతికి ఒక్కో ఉపాధ్యాయుడిని నియమించాలి. ఉపాధ్యాయులు శిక్షణ పొందిన వారు మాత్రమే ఉండాలి.

కానీ, జీతాలు ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంగా చాలా పాఠశాలలు తక్కువమంది సిబ్బందితో, అర్హత లేని ఉపాధ్యాయులతో నడుస్తున్నాయి. విద్యార్థుల క్రీడలకు అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలి. విశాలమైన ఆటస్థలం ఉండాలి కానీ, రాష్ట్రంలో 80 శాతం పాఠశాలల్లో ఈ సౌకర్యాలు మచ్చుకైనా కనిపించవు. ఇరుకు గదులు, జనసమ్మర్దం కలిగి ఉండే కూడళ్ళలో, రేకుల షెడ్లు, అపార్ట్‌మెంట్లలో స్కూళ్లు దర్శనమిస్తున్నాయి. పుస్తకాల పేరిట భారీగా దోపిడీ చేస్తున్నా విద్యాశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. రాష్ట్రంలో అత్యధిక శాతం ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు నిబంధనలను పాటించడం లేదు. తరగతి గదుల్లోకి గాలి, వెలుతురు సమృద్ధిగా ప్రసరించాలి. చీకటిగా ఉండకూడదు. చాలా పాఠశాలల్లో ఈ పరిస్థితులు ఎక్కడా లేవు.

జీవో నెంబర్ 91 ద్వారా ప్రాంతాల వారీగా వసూలు చేయాల్సిన ఫీజులను పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ప్రభుత్వ గుర్తింపు పొంది, అర్హులైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాలు ఉన్న పాఠశాలలో గ్రామీణ ప్రాంతాలలో ఏడాదికి రూ. 9 వేలకు మించకూడదు. పట్టణ ప్రాంతాలలో ఏడాదికి రూ. 12,500 తీసుకోవాలి. అన్ని రకాల ఫీజులు ఇందులో భాగమే. జీవోలో స్పష్టంగా ఉన్నప్పటికీ ఆ రాజపత్రాలను తుంగలో తొక్కి దీనికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై ప్రభుత్వాలు, విద్యాశాఖ అధికారులు ఏ మాత్రం స్పందించడం లేదు. అందుకే, విద్యాహక్కు చట్టం అమలుకు, ఫీజుల నియంత్రణకు, అక్రమ దోపిడీని అరికట్టేందుకు విద్యావేత్తలు, మేధావులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరూ ఏకమై ఉద్యమించాల్సి ఉంది.