calender_icon.png 25 October, 2024 | 4:54 AM

ఫిరాయింపుల ముఠా నేత పోచారం

25-10-2024 02:04:31 AM

  1. ఆ 10 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అవసరమా? 
  2. గంగారెడ్డిని హత్యచేసిన నిందితుడు సంతోష్.. ఎమ్మెల్యే సంజయ్ అనుచరుడు కాదని చెబుతాడా? 
  3. పార్టీలో జరుగుతున్న పరిణామాలు నాకు బాధ కలిగిస్తున్నాయి 
  4. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి  
  5. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, సోనియా, రాహుల్, సీఎం తదితరులకు లేఖలు

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాంతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉన్నప్పటికీ.. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం ఎందుకు? అని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

పార్టీ ఫిరాయింపుల వల్ల క్షేత్రస్థాయిలో కాంగ్రె స్ కార్యకర్తలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పార్టీ ఫిరాయింపులను తాను జీర్ణించుకోలేకపోతున్నట్లు ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఫార్టీ ఫిరాయింపులకు ముఠా నాయకుడిగా వ్యవహరిస్తున్నారని జీవన్‌రెడ్డి మండిపడ్డారు.

బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆ 10 మంది ఎమ్మెల్యేలు లేకుంటే ప్రభుత్వం నడవదా? అని ఆయన నిలదీశారు. గురువారం ఆయన సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ర్ట కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలు, పార్టీ ఫిరాయింపుల అంశంపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు సీఎం, డిప్యూటీ సీఎం తదితరులకు లేఖలు రాసినట్లు జీవన్‌రెడ్డి తెలిపారు.

కొన్ని స్వార్థపూరిత శక్తులు అభివృద్ధి నెపంతో పార్టీ ఫిరా యింపులకు పాల్పడి.. కాంగ్రెస్ ముసుగు వేసుకోవడం తనకు బాధ కలిగిస్తోందని విమర్శించారు. ఆధిపత్య పోరు కోసం తన అనుచరుడు గంగారెడ్డిని క్రూరంగా హత్య చేశారని జీవన్‌రెడ్డి తెలిపారు. 

ఈ హత్యలో ఎమ్మెల్యే సంజయ్ పాత్ర ఉందని తాను ఎక్కడా మాట్లాడలేదని, హత్యకు పాల్పడిన వ్యక్తి బత్తిన సంతోష్ బలమైన బీఆర్‌ఎస్ కార్యకర్త అని మాత్రమే చెప్పానని ఆయన వివిరించారు. నిందితుడు సంతోష్‌పై అనేక కేసులు ఉన్నాయన్నారు.

ఎవరి అండదండలు చూసుకుని గంగారెడ్డిని హత్య చేశారని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. అవసరమైతే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ను కలిసి తన ఆవేదనను చెబుతానని తెలిపారు. పార్టీ విధానానికి అనుగుణంగానే తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

పార్టీ పెద్దలకు జీవన్‌రెడ్డి రాసిన లేఖలో ప్రధాన అంశాలు..

‘నేను నమ్ముకున్న కాంగ్రెస్ పార్టీ నన్ను ఆగౌరవంగా, అవమానంగా చూస్తోంది. నా భవిష్యత్తు కార్యాచరణ పార్టీనే మార్గదర్శకం చేయాలి. కేసీఆర్ లాగనే కాంగ్రెస్ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం వల్ల ప్రజలు ఆశ్చర్యానికి గురవుతున్నారు. రాహుల్‌గాంధీ ఆలోచనలకు భిన్నంగా పార్టీ నడు స్తోంది.

పార్టీ ఫిరాయించిన వారికి ప్రత్యేక గుర్తింపు లభిస్తుందనే అభిప్రాయాన్ని కలిగించే విధంగా పార్టీ వ్యవహారం ఉంది. గతంలో సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కకు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా చేయడం లో.. అప్పటి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిది కీలక పాత్ర. ఇప్పుడు బీఆర్‌ఎస్ నుంచి కాం గ్రెస్‌లో చేరిన పోచారం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిం చడం దేనికి సంకేతం.

అంతేకాకుండా ఆయ న్ను ప్రభుత్వ సలహాదారుగా నియమించా రు. పోచారం పార్టీ ఫిరాయింపులపై సలహా లు ఇవ్వడానికి మాత్రం సరిపోతారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అనేక దౌర్జన్యాలను ఎదుర్కొన్నామని.. ఇప్పుడు కాంగ్రెస్ ముసు గు వేసుకుని మళ్లీ దౌర్జన్యాలు చేస్తామంటే ఎలా భరించాలి? అని జీవన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మె ల్యే సంజయ్‌కుమార్ అనుచరుడిగా భావిం చే సంతోష్ అనే వ్యక్తి.. కాంగ్రెస్ నాయకుడిని హత్య చేశాడని తెలిపారు. పార్టీని కన్నతల్లి అనుకున్నానని, పార్టీ తనకు అనేక అవకాశా లు ఇచ్చిందని తెలిపారు. ఎంపీ ఉప ఎన్నిక ల్లో కేసీఆర్‌పై పోటీ చేయాలని పార్టీ ఆదేశిస్తే పోటీ చేసినట్లు జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. 

రాజీవ్ నాయకత్వంలో పార్టీలో చేరా.. 

‘కాంగ్రెస్ పార్టీ పుట్టిందే మా ఇంట్లో అని ఎమ్మెల్యే సంజయ్ అంటున్నాడు. మీ ఇంట్లో కాంగ్రెస్ పార్టీ పుడితే  పరాయి ఇంటికి ఎందు కు వెళినట్లు? సంజయ్ ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీకి ఓటేశాడా? నేను రాజీవ్‌గాం ధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. ఎమ్మెల్యే సంజయ్ చొక్కారావు మనవడిని అని చెప్పుకుంటున్నారు. ఇందిరాగాందీ కష్టకాలంలో ఉన్నప్పుడు చొక్కారావు జనతా పార్టీలో చేరాడు.

సంజయ్ టీఆర్‌ఎస్‌లో ఎన్నడూలేడు, అక్కడి ఉద్యమ నాయకుల మధ్య సమన్వయ లోపం వల్లే ఆయన తెరపైకి వచ్చాడు. అభివృద్ధి జరగాలంటే అధికార పార్టీలో చేరతా మంటే ప్రజాస్వామ్యం ఉంటుందా? పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన కేసీఆర్ పరిస్థితి ఏమైంది’ అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు.

నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను.. 

‘నేను నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. పార్టీని వదిలి వెళ్లాలనే ఆలోచన చేయలేకపోతున్నాను. అవమానాలు భరించుకుంటూ ఉండాలా? రేవంత్ మా నాయకుడు, ఆయన్ను తప్పకుండా కలుస్తాను. కాంగ్రెస్ కార్యకర్తల ఆవేదన మా వ్యక్తిగతం అని పీసీసీ చీఫ్ భావిస్తే నేనేం చేయగలను. పార్టీ పట్ల గౌరవం లేకనే నేను ఇక్కడి దాకా వచ్చానా.. ఇప్పటికీ నాకు పార్టీపై గౌరవం ఉంది.

రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ నాయకత్వంలో ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తోంది. నేను రాజకీయం చేయడం లేదు. ఎమ్మెల్యే సంజయ్ భుజాలు తడుముకుంటున్నాడు, మా పార్టీ నాయకుడిని చంపిన నిందితుడు సంజయ్ అనుచరుడు కాదని చెప్పగల రా? సంజయ్ ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే క్లారిటీ లేదు.

దానం నాగేందర్‌కు ఎంపీ టికెట్  ఇవ్వడాన్ని కూడా సమర్థించడం లేదు, నేనెప్పుడు పార్టీ ఫిరాయించలేదని, నాకు నేనుగా మంత్రి పదవికి రాజీనామా చేశాను. పదేళ్ల బీఆర్‌ఎస్ కాలంలో పార్టీని నిలబెట్టాను. రాహుల్ ప్రధాని కావాల్సిందే. నామినేటెడ్ పదవులు మాకు ఇవ్వాలి.

పార్టీలో మాదే అధిపత్యం ఉండాలంటే ఎలా..? పార్టీ ఫిరాయింపు ముసుగేసుకుని దౌర్జ న్యం చేయడం బ్లాక్ మెయిల్ కాదా? నా మానసిక పరిస్థితి ఆర్థం చేసుకోండి. పార్టీ ఫిరాయింపులు జరిగాయో లేదో క్లారిటీ లేకుండా పోతుంది. నేను పార్టీకి అంతర్గతంగా లేఖ రాశాను. ఆవేదన భరించలేకనే బయటికి వచ్చి చెప్పుకుంటున్నాను’ అని జీవన్‌రెడ్డి లేఖలో పేర్కొన్నారు.