- బాన్సువాడలో ఉపఎన్నికకు సంకేతాలు
- తనయుడిని బరిలో నిలిపే యత్నాలు
కామారెడ్డి, జనవరి 15 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఉపఎన్నిక రాబోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బాన్సువాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ వ్యవసా య సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా అందుకు భిన్నంగా ఆయన మళ్లీ గులాబీ గూటికే వెళ్లబోతున్నారంటూ రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
బీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన కాంగ్రెస్ గూటికి చేరిన విషయం తెలిసిందే. తన తనయుడు పోచారం భాస్కర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే బాన్సువాడ నియోజకవర్గానికి ఉపఎన్నిక తప్పేలా లేదని ప్రచారం జరుగుతోంది.
పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ ఎమ్మెల్యేగా రాజీనా మా చేసేందుకే నిర్ణయించుకున్నారని, అందు కే క్యాబినెట్‌లో చోటు అడగకుండా, ప్రభుత్వ వ్యవసాయ సలహాదారుగా నియామకమయ్యారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.
ఏనుగుకు ఎమ్మెల్సీ పదవి!
అధిష్టానంతో మాట్లాడి.. గత ఎన్నికల్లో బాన్సువాడలో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీచేసిన ఏనుగు రవీందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తద్వారా తన కుమారుడికి ఉపఎన్నికలో లైన్‌క్లియర్ అవుతుం దని పోచారం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బాన్సువాడ నియోజకవర్గంలో ఇప్పటికే పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.
అధిష్ఠానం దృష్టికి పోచారం తన రాజీనామా విషయాన్ని తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో రాజీనామా చేస్తే రవీందర్‌రెడ్డి వర్గాన్ని తనకు అనుకులంగా మలుచుకోవాలని తాపత్రయంలో పోచారం ఉన్నట్లు తెలుస్తోంది. రవీందర్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి కట్టబెడితే భాస్కర్‌రెడ్డికి ఎమ్మెల్యే సీటు దక్కడం సులవవుందని భావిస్తున్నట్లు సమాచారం. పాత కాంగ్రెస్ క్యాడర్‌కు పోచారంతో సఖ్యతగా లేదు. పాత క్యాడర్ ఏనుగు రవీందర్‌రెడ్డికి అనుకూలంగా ఉంది.
దీనికి తోడు పోచారం శ్రీనివాస్‌రెడ్డికి చెందిన బీఆర్‌ఎస్ క్యాడర్ కూడా తనతో కాంగ్రెస్‌లోకి రాకపోవడంతో పోచారం మదిలో రాజీనామా చేసి ప్రజలకు చేరువ కావాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్‌లో క్యాడర్ ఆయనకు అనుకూలంగా లేదని, తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్తారన్న ప్రచారమూ సాగుతోంది. రాజీనామా విషయమై పోచారం శ్రీనివాస్‌రెడ్డి క్లారిటీ ఇవ్వకపోవడంతో బాన్సువాడ నియోజకవర్గంతో పాటు జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కొడుకు కోసం..
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తన తనయుడు భాస్కర్‌రెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పోచారం భావిస్తున్నట్లు అతడి అనుచరులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో స్పీకర్‌గా పనిచేసిన వ్యక్తి మరోసారి ఎన్నికల్లో గెలవరన్న రికార్డును పోచారం తిరగరాశారు. నియోజకవర్గంపై ఆయనకు బలమైన పట్టు ఉండటంతోనే ఇది సాధ్యమైంది. దీంతో తాను ఉనికిలో ఉన్నప్పడే భాస్కర్‌రెడ్డిని గెలిపించి, రాజకీయ వేదిక కల్పించాలని పోచారం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.