calender_icon.png 22 January, 2025 | 6:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత కోసం ‘పీఎం ప్యాకేజీ’

24-07-2024 01:24:16 AM

  1. ఉద్యోగాల కల్పనకు 3 కొత్త ఈపీఎఫ్‌ఓ పథకాలు 
  2. కొత్తగా ఉద్యోగంలో చేరేవారికి రూ.15 వేల ప్రోత్సాహకం 
  3. మొత్తం రూ. 1.07 లక్షల కోట్ల కేటాయింపు

న్యూఢిల్లీ, జూలై 23 : కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి తాజా బడ్జెట్‌లో వరాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సంఘటిత రంగంలో కొత్తగా చేరే వారి కోసం పీఎం ప్యాకేజీ పేరుతో మూడు కొత్త ఈపీఎఫ్‌వో పథకాలను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ ఈ మూడు పథకాలను ప్రకటించారు. వీటి అమలు కోసం రూ. 1.07 లక్షల కోట్లు కేటాయించారు. తొలిసారి ఉద్యోగంలో చేరే వారికి  మూడు వాయిదాల్లో  ఒక నెల జీతం   ఇవ్వనున్నట్లు చెప్పారు. గరిష్టంగా రూ. 15 వేలు చెల్లిస్తామని తెలిపారు. నెలకు రూ. 1 లక్షలోపు జీతం పొందే ఉద్యోగులే ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 2.1 కోట్ల మంది యువతకు లబ్ధి చేకూరుతుందని, ఈపీఎప్‌వోలో నమోదు ఆధారంగా దీన్ని అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం రూ. 23,000 కేటాయిస్తామన్నారు. 

ఉద్యోగితో పాటు యజమానికి ప్రయోజనాలు

మరోవైపు, తయారీ రంగంలో ఉపాధి కల్పన కోసం అదనపు ప్రోత్సాహకాలను అందిస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఉద్యోగంలో చేరిన మొదటి నాటుగేళ్ల పాటు ఉద్యోగితో పాటు యజమానికి నేరుగా ప్రోత్సాహకం అందిస్తామని తెలిపారు. తద్వారా ఈ రంగంలో ఉపాధిలోకి ప్రవేశించే 30 లక్షల మంది యువతకు, యజమానులకు ప్రయోజనం చేకూరనుందని వెల్లడించారు. ఇందుకోసం రూ. 52,000 కోట్లు కేటాయిస్తామన్నారు. ఇక, నెలకు రూ. 1 లక్ష జీతంలోపు జీతం పొందుతున్న ప్రతి ఉద్యోగికి యాజమాన్యం చెల్లించే ఈపీఎఫ్‌ఓ కంట్రిబ్యూషన్‌ను రీయింబర్స్ చేస్తామని వెల్లడించారు. ప్రతినెలా రూ. 3 వేల చొప్పున రెండేళ్ల వరకు దీన్ని అమలు చేస్తామన్నారు. ఈ పథకం క్రింద 50 లక్షల మందికి ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇందు కోసం రూ. 32,000 కోట్లు కేటాయించనున్నట్లు తెలిపారు.