29-03-2025 02:29:04 AM
ఏప్రిల్ 3 నుంచి 6 వరకు ప్రధాని టూర్
న్యూఢిల్లీ, మార్చి 28: ప్రధాని నరేంద్ర మోదీ థాయ్‌లాండ్, శ్రీలంక పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఖరారైంది. ఏప్రిల్ 3 నుంచి 6 వరకు మోదీ పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ వెల్లడించింది. థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్ షినావర్తా ఆహ్వానం మేరకు మోదీ ఆ దేశంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 3,4వ తేదీల్లో థాయ్‌లాండ్‌లో జరగనున్న 6వ బిమ్‌స్టెక్ కూటమి సమావేశంలో మోదీ పాల్గొననున్నారు. ఆ తర్వాత మోదీ థాయ్‌లాండ్ ప్రధాని పేటోంగ్టార్న్‌తో భేటీ అవనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చ జరగనుంది. అనంతరం ఏప్రిల్ 4న శ్రీలంక వెళ్లనున్న ప్రధాని మోదీ ఆ దేశ అధ్యక్షుడు అనురకుమార దిశనాయకేతో భేటీ కానున్నారు. ఇరుదేశాధినేతలు పలు ద్వైపాక్షిక ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు. పర్యటనలో భాగంగా సంపుర్ సోలార్ పవర్‌స్టేషన్ సహా పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభించనున్నారు. 2019 తర్వాత మోదీ శ్రీలంకలో పర్యటించడం ఇదే తొలిసారి.