పాలు, తేనె ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నాం.
సూర్య ఘర్ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.
గాంధీనగర్: ప్రపంచంలోని అనేక సమస్యలకు మనదేశం పరిష్కారం చూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గుజరాత్ లో గ్లోబల్ రెన్యువబుల్ ఎనర్జీ ఇన్వెస్టర్స్ మీట్, ఎక్స్ పో సదస్సును ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ... సదస్సుు హాజరైన దేశ, విదేశీ ప్రతినిధులకు కృతజ్జతలు తెలిపారు. ఈ సదస్సులో రెన్యువబుల్ ఎనర్జీపై సుదీర్ఘ చర్చలు జరుగుతాయన్నారు. ఎంతో నమ్మకంతో మాకు మూడోసారి అధికారం అప్పగించారని ప్రధాని పేర్కొన్నారు. 70 ఏళ్ల తర్వాత భారత ప్రజలు ప్రత్యేక తీర్పు ఇచ్చారని వెల్లడించారు.
ఎస్సీ, ఎస్టీలు, వెనుకబడిన వర్గాల శ్రేయస్సు కోసం పనిచేస్తామని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారాలని సంకల్పం తీసుకున్నామని వెల్లడించారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తున్నామని చెప్పారు. గడిచిన వంద రోజుల్లో అనేక హైవే కారిడార్లకు అనుమతి ఇచ్చాం, గ్రీన్ ఎనర్జీ దిశగా అడుగులు వేశామని తెలిపారు. గ్రీన్ ఎనర్జీ రంగంలో రూ. 700 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నామన్నారు. ఇక్కడ జరిగిన తొలి సోలార్ సదస్సుకు అనేక దేశాల ప్రతినిధులు వచ్చారని చెప్పిన మోడీ పాలు, తేనె ఉత్పత్తిలో విప్లవాత్మక అడుగులు వేస్తున్నామని వెల్లడించారు.
సౌరశక్తిని ఉపయోగించుకునేందుకు అనేక పథకాలు తెచ్చామని తెలిపారు. ప్రకృతితో అనుసంధానమై జీవించాలని గాంధీజీ కోరారన్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. వాతావరణాన్ని కలుషితం చేయడాన్ని గాంధీజీ వ్యతిరేకించారని గుర్తుచేశారు. వచచే వందేళ్లను దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. 2047లోగా అభివృద్ధి చెందిన దేశంగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు. సౌర, పవన, అణువిద్యుత్ ఉత్పత్తి రంగాల్లో పురోగతి సాధిస్తామన్నారు. సూర్య ఘర్ పథకం గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. సూర్యఘర్ పథకాన్ని వినియోగించుకుని దేశంలోని ప్రతి ఇల్లు విద్యుదుత్పత్తి సాధించాలని కోరారు.