27-04-2025 12:04:45 PM
మన్ కీ బాత్'లో ప్రధాని మోదీ
ఉగ్రవాద మాస్టర్లు కాశ్మీర్‌ను నాశనం చేయాలనుకుంటున్నారు
మానవ కల్యాణం కోసం మన దేశం కట్టుబడి ఉంది
కష్టాల్లో ఉన్న అనేక దేశాలకు సాయం
న్యూఢిల్లీ: కొత్త జాతీయ విద్యావిధానం రూపకల్పనలో కస్తూరీరంగన్ పాత్ర ప్రశంసనీయమని ప్రధాని నరేంద్ర మోదీ మన్ కీ బాత్(PM Modi Mann Ki Baat)లో అన్నారు. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లో కొన్నేళ్లుగా ప్రశాంత పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. జమ్మూకశ్మీర్ అభివృద్ధి తట్టుకోలేకే ఇలాంటి దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. పహల్గాం దాడిని దేశ ప్రజలంతా ఖండించారు.. నిరసన తెలిపారని ప్రధాని పేర్కొన్నారు. అనేక దేశాల నేతలు ఫోన్ చేసి ఉగ్రదాడిని ఖండించారని చెప్పారు. ఉగ్రదాడి బాధ్యులు అందరూ మూల్యం చెల్లించక తప్పదని ప్రధాని మోదీ(Narendra Modi) హెచ్చరించారు. కస్తూరీరంగన్ నేతృత్వంలో ఇస్రో అనేక కార్యక్రమాలు చేపట్టిందని ఆయన గుర్తుచేశారు. కస్తూరీరంగన్ నుంచి నేటి యువత ఎంతో నేర్చుకోవాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఆర్యభట్ట ఉపగ్రహం(Aryabhata satellite) ప్రయోగించి 50 ఏళ్లు పూర్తయ్యిందని ఆయన గుర్తుచేశారు.
దేశాభివృద్ధిలో మన శాస్త్రవేత్తల కృషి గొప్పదని ప్రధాని కొనియాడారు. అంతరిక్షంలోకి అతితక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు పంపిస్తున్నామని ఆయన వెల్లడించారు. అనేక దేశాల శాటిలైట్లను కూడా ఇస్రో పంపిస్తోందన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు వచ్చాక స్పేస్ స్టార్టప్ లు దూసుకుపోతున్నాయని చెప్పారు. దేశవాసులంతా గర్వపడేలా ఇస్రో శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మయన్మార్ భూకంపం(Myanmar earthquake)లో మన సైనికుల సేవలు మరిచిపోలేమని ప్రధాని తెలిపారు. భూకంప శిథిలాల నుంచి మన సైనికులు అనేకమందిని రక్షించారని సూచించారు. మానవ కల్యాణం కోసం మన దేశం కట్టుబడి ఉందని ఆయన వివరించారు. కష్టాల్లో ఉన్న అనేక దేశాలకు సాయం అందించడంలో ముందున్నామని స్పష్టం చేశారు. ఔషధాలు పంపించి ఇథియోపియా చిన్నారులను రక్షించామని తెలిపారు. అనేక దేశాలకు ప్రాణాంతక వ్యాధులు నుంచి రక్షించే ఔషధాలు అందించామని పేర్కొన్నారు.