దర్భంగా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం బీహార్‌లోని దర్భంగా ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు శంకుస్థాపన చేశారు. దర్భంగాలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని గత పదేళ్లలో దేశంలో అందుబాటులోకి కొత్తగా లక్షకుపైగా మెడికల్ సీట్లు తెచ్చామన్నారు. వచ్చే ఐదేళ్లలో కొత్తగా అందుబాటులోకి మరో 75 వేల మెడికల్ సీట్లు తీసుకువస్తామని హామీ ఇచ్చారు.
''గతంలో డాక్టర్ కావాలంటే ఇంగ్లీష్ రావడం తప్పనిసరి ఉంటేది.. మధ్యతరగతి, పేదవారి పిల్లలు పాఠశాలల్లో ఇంగ్లీష్ ఎలా చదువుకోగలరు, అంత డబ్బులు ఎక్కడ నునంచి తెస్తారు.. అందుకే మా ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. డాక్టర్ లేదా ఇంజినీర్ అవ్వాలనుకుంటే తమ తమ మాతృభాషలోనే చదువుకుని డాక్టర్ కావచ్చు, మాతృభాషలోనే చదువుకుని ఇంజినీర్ కావచ్చు'' అని ప్రధాని వెల్లడించారు.
దేశంలో 24 ఎయిమ్స్ ఆస్పత్రులు ఉన్నాయని పేర్కొన్నారు. "మా ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తుంది, నేడు, మేము ఒకే కార్యక్రమంలో 12,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నాము" అని ప్రధాన మంత్రి చెప్పారు. ఎయిమ్స్ దర్భంగా నిర్మాణం బీహార్ ఆరోగ్య సంరక్షణ రంగంలో గణనీయమైన మెరుగుదలలను తీసుకువస్తుందని ఆయన అన్నారు. ఎయిమ్స్ దర్భంగాలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఆయుష్ బ్లాక్, మెడికల్, నర్సింగ్ కాలేజీలు, రెసిడెన్షియల్ సదుపాయాలు, నైట్ షెల్టర్ ఉన్నాయి. బీహార్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తృతీయ ఆరోగ్య సంరక్షణను అందిస్తుందని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.