న్యూఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ గెలవడంతో డొనాల్డ్ ట్రంప్ కు ప్రధాని నరేంద్ర మోడీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ట్రంప్ చరిత్రాత్మక విజయం సాధించారని ప్రధాని మోడీ కొనియాడారు. మిడిల్ ఈస్ట్ వివాదాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య "ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు"ని ప్రోత్సహించాలని భారత ప్రధాని డొనాల్డ్ ట్రంప్‌ను కోరారు. మనం గతంలోనూ చక్కని భాగస్వామ్యంతో చేశామని, అదే స్ఫూర్తితో ముందుకు వెళ్దామని కోరారు. ఇరుదేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేద్దామన్నారు. నూతన అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యారంటూ ఆయనకు యుఎస్ హౌస్ స్వీకర్ మైక్ జాన్సన్ శుభాకాంక్షలు తెలిపారు. 2024 ఎన్నికల్లో అమెరికన్ ఓటర్లు రిపబ్లికన్ పార్టీ వైనే మొగ్గుచూపారు. దీంతో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హారిస్ కు నిరాశ ఎదురైంది.