calender_icon.png 3 October, 2024 | 8:10 AM

వరద ప్రభావంపై సీఎంతో మాట్లాడిన ప్రధాని మోదీ, అమిత్ షా

03-09-2024 06:33:28 PM

హైదరాబాద్: వర్ష ప్రభావం 11 జిల్లాల్లో ఎక్కువగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వరద ప్రభావంపై సీఎంతో దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షా మాట్లాడారని తెలిపారు.  సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారని, తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమీక్ష చేస్తున్నారని కిషన్ రెడ్డి వెల్లడించారు. దెబ్బతిన్న రహాదారులకు మరమ్మతులు చేయాలని పీఎంవో ఆదేశించిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వద్ద రాష్ట్ర విపత్తు నిర్వహణ నిధి ఉందని కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు. ఎస్ డీఆర్ఎఫ్ లో రూ.1,345 కోట్లు ఉన్నాయని, ఎస్ డీఆర్ఎఫ్ నిధులతో వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

రాష్ట్రం ఇచ్చే నివేదిక ఆధారంగా కేంద్ర బృందాలు సమీక్షిస్తాయని, మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చిందని ఆయన వెల్లడించారు. ఆవులు, గొర్రెలకు కూడా కేంద్రం నష్టపరిహారం ఇస్తుందని, అవసరమైతే రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలియజేశారు. జాతీయ విపత్తు ఎక్కడా ప్రకటించడం లేదని, నిధులు ఇస్తున్నప్పుడు జాతీయ విపత్తుగా ప్రకటించడం ఎందుకు..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.