27-02-2025 09:12:20 PM
కొత్తగూడెం,(విజయక్రాంతి): సింగరేణి కాలరీస్ కార్పొరేట్ ఏరియా ఆధ్వర్యంలో సింగరేణి ప్రధాన కార్యాలయం నందు కార్పొరేట్ పరిధిలోని వివిధ డిపార్ట్మెంట్లలో పని చేసే మహిళా ఉద్యోగులకు, కేసిఓఏ క్లబ్ నందు సేవా సభ్యులకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అత్యంత ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేయనున్నారు. గురువారం సింగరేణి ప్రధాన కార్యాలయ జిఎం(పర్సనల్) వెల్ఫేర్ ఛాంబర్ మహిళా ఉద్యోగులు, సింగరేణి సేవా సెక్రటరీలు, సంబంధిత అధికారులతో జిఎం(పర్సనల్) వెల్ఫేర్, ఐఆర్ అండ్ పీఎం కవితా నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఆర్ అండ్ పీఎం కవితా నాయుడు మాట్లాడుతూ... మార్చి 8వ తేదీన సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్నిఅత్యంత ఘనంగా నిర్వహించుటకు సింగరేణి సంస్థ ఏర్పాట్లతో, ప్రణాళికలను సిద్దం చేస్తుందని, కార్పొరేట్ ఏరియా మహిళా ఉద్యోగులకు అందరూ పాల్గొనాలని, సూచించారు.
హెడ్డాఫీస్ లో వివిధ క్రీడా పోటీలను నిర్వహించి సింగరేణి ప్రధాన కార్యాలయ హెచ్‌ఆర్‌డి కాన్ఫరెన్స్ హాల్ నందు 08.03.2025 న సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు ఇవ్వనున్నారు. సింగరేణి సేవా సమితి సభ్యులకు 10.03.2025న కేసిఓఏ క్లబ్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంధర్భముగా ఆటల పోటీలను మరియు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి బహుమతులను ప్రధానం చేయనున్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమములో, శ్రీమతి కవితానాయుడుతో పాటు, డిజిఎం(పర్సనల్) జి.రాజేంద్ర ప్రసాద్, కమ్మ్యునికేషన్ ఆఫీసర్ టి.శ్రీనివాస రావు, మేనేజ్మెంట్ ట్రైనీ(పర్సనల్) కె.ఉదయ్ కుమార్, మహిళా ఉద్యోగులు, వెల్ఫేర్ పిఏ కే.వరప్రసాద్, స్పోర్ట్స్ సుపర్వైసర్ ఎంసి ఫాస్నేట్, సేవా సెక్రటరీ శ్రీమతి సుజాత, సేవా కొ-ఆర్డినేటర్లు పాల్గొన్నారు.