22-02-2025 12:00:00 AM
రాష్ట్రాలపై హిందీని బలవంతంగా రుద్దడంపై తమిళనాడులో మరోసారి వివాదం రాజుకుంటోంది. జాతీయ విద్యావిధానంలో భాగంగా త్రిభాషా విధానాన్ని అమలు చేయని పక్షంలో తమిళ నాడు ‘సర్వశిక్ష అభియాన్’ కింద కేంద్రం ఇచ్చే నిధులను కోల్పోవలసి వస్తుందంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కొద్ది రోజుల కింద చేసిన ప్రకటన ఈ వివాదానికి కారణమయింది. తమిళనాడు రా జ్యాంగానికి అనుగుణంగా నడుచుకోవాలని, త్రిభాష విధానాన్ని పాటించాలని కూడా ఆయన సూచించారు.
మంత్రి ప్రకటనపై తమిళనాడులోని డిఎంకే ప్రభుత్వం ఒక్కసారిగా భగ్గుమంది. ధర్మేంద్ర ప్రధాన్ బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడుతున్నారని, విద్యపై రాష్ట్రాలకున్న హక్కులను కాలరాయా లని చూస్తున్నారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రధాని మోదీకే నేరుగా లేఖ రాశారు. ‘సర్వశిక్ష అభియాన్’ కింద రాష్ట్రానికి దక్కాల్సిన దాదాపు రూ.2,400 కోట్ల నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన కుమారుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి దయానిధి మారన్ మరోఅడుగు ముందుకేసి హిందీని బలలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తే రాష్ట్ర ప్రజలు గతంలో ‘ గో బ్యాక్ మోదీ’ అన్నారని, మళ్లీ అదే ప్రయత్నం చేస్తే రాష్ట్రం మరోసారి భాషా యుద్ధానికి సిద్ధమవుతుందని హెచ్చరించారు.
తమిళనాడు త్రిభాషా విధానాన్ని మొదటినుంచీ తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉంది. హిందీకి వ్యతిరేకంగా 1930లో ఒకసారి, 1960లో మరోసారి ఆ రాష్ట్రంలో భారీఎత్తున ఆందోళనలు కూ డా జరిగాయి. అంతేకాదు మొదటినుంచి కూడా తమిళనాడులోని ప్రభు త్వ పాఠశాలల్లో ద్విభాషా విధానం అంటే మాతృభాష అయిన తమిళంతో పాటు ఇంగ్లీషులో మాత్రమే బోధన జరుగుతోంది. కొన్ని ప్రైవేటు పాఠశాల్లో హిందీ కూడా ఉన్నప్పటికీ దాన్ని ఎంచుకునే విద్యార్థుల శాతం చా లా తక్కువ.
మాతృభాష పట్ల వారికున్న ప్రేమ కావచ్చు, హిందీపట్ల ఉన్న వ్యతిరేకత కావచ్చు కానీ రాష్ట్రంలో హిందీని బలవంతంగా రుద్దడాన్ని మా త్రం అన్ని ద్రవిడ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. చివరికి త్రిభాషా సూత్రాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీ సైతం ఈ విషయంలో తమిళుల మనోభావాలను గౌరవించక తప్పలేదు. ఇది ఒక్క పాఠశాల్లో హిందీ అమలుకు మాత్రమే పరిమితం కాలేదు. గతంలో వైద్యవిద్యా కోర్సుల్లో అడ్మి షన్ల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే ‘నీట్’ పరీక్షను రద్దు చేయాలం టూ కూడా రాష్ట్రంలో ఆందోళనలు కొనసాగాయి.
ప్రాంతీయ భాషల్లో చదివే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇది ప్రతిబంధకంగా ఉందనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. చివరికి ప్రాంతీయ భాషల్లో కూడా నీట్ నిర్వహణకు కేంద్రం అంగీకరించడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అయితే ఎప్పుడు ఏ చిన్నవివాదం తలెత్తినా నీట్ రద్దు డిమాండ్ తెరమీదికి వస్తూనే ఉంది. ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు మొదలుకొని అన్ని విషయాల్లోను హిందీని ఆ రాష్ట్రం వ్యతిరేకిస్తూనే వస్తోంది.
తాజాగా ఈ వివాదం ముదురుతున్న సంకేతాలు కనిపించడంతో ధర్మేంద్ర ప్రధాన్ ఓ మెట్టు దిగివచ్చి కేంద్రప్రభుత్వం ఏ భాషనూ బలవంతంగా రుద్దడం లేదని, అయితే విదేశీ భాషపై అతిగా ఆధారపడ్డం వల్ల విద్యార్థులు భాషాపరమైన మూలాలను తెలుసుకోకుండా పరిమితం చేసినట్లవుతుందంటూ వివరణ ఇచ్చారు. విద్యను రాజకీయం చేయవద్దంటూ విజ్ఞప్తి చేయాల్సి వచ్చింది.
వాస్తవానికి తమిళనాడులో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడం ఈ వివాదానికి నేపథ్యంగా కనిపిస్తోంది. తమిళనాడులో ఇప్పటిదా కా కాలు పెట్టలేకపోయిన బీజేపీ ఎలాగైనా ఈ సారి సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అణ్ణామలై ఈ విష యంలో దూకుడుగానే ముందుకు వెళ్తున్నారు. మార్చి 1నుంచి రాష్ట్రంలో ప్రచారానికి కూడా పార్టీ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో మరోసారి హిందీ వివాదాన్ని ఓ ఆయుధంగా మలుచుకోవాలన్న పార్టీ వ్యూహం ఆదిలోనే బెడిసికొట్టింది. హిందీని రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోను అంగీకరించబోరని ప్రధాన్ ప్రకటన తర్వాత జరిగిన నిరసనలు చెప్పకనే చెప్పాయి.