calender_icon.png 30 September, 2024 | 12:59 AM

బొగ్గు గని కార్మికులకు పిఎల్ఆర్ బోనస్

29-09-2024 10:27:43 PM

సింగరేణి కార్మికులకు దీపావళి పండుగకు ముందు

కోల్ ఇండియా కార్మికులకు దసరా పండుగకు ముందు చెల్లింపు

బోనస్ పెంపు కార్మికుల విజయం

సిఐటియు నాయకులు డిడి రామనందన్, మంద నర్సింహారావు

మందమర్రి,(విజయక్రాంతి): దేశవ్యాప్త బొగ్గు గని కార్మికులకు చెల్లించే పర్ఫామెన్స్ లింక్డ్ రివార్డ్ (పిఎల్ఆర్) బోనస్ దీపావళి బోనస్ చెల్లింపుపై ఆదివారం న్యూఢిల్లీలో జాతీయ కార్మిక సంఘాలతో కోలిండియా యాజమాన్యం, సింగరేణి యాజమాన్యం చర్చలు నిర్వహించారు. ఈ చర్చల్లో 2023-24 ఆర్థిక సంవత్సరం కోలిండియాకు వచ్చిన లాభాల్లో కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ 93,750 రూపాయలు చెల్లించేందుకు సమావేశంలో కోలిండియా ప్రతినిధులతో పాటు సింగరేణి ప్రతినిధులు, జాతీయ కార్మిక సంఘాల ఏఐటీయూసీ, సిఐటియు, హెచ్ఎంఎస్, బిఎంఎస్ నాయకులు ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని సిఐటియు చర్చల కమిటీ సభ్యుడు డిడి రామనందన్, సిఐటియు అనుబంధ ఎస్సిఈయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వేజ్ బోర్డ్ సభ్యుడు మంద నర్సింహారావు లు ఫోన్ ద్వారా తెలిపారు.

గత సంవత్సరం కార్మికులకు 85,000 రూపాయలు పిఎల్ఆర్ బోనస్ కోలిండియా, సింగరేణి యాజమాన్యాలు చెల్లించగా, ఈసంవత్సరం రూపాయలు 8,750 రూపాయలు అధికంగా ఒప్పందం చేయడం జరిగిందన్నారు. జాతీయ కార్మిక సంఘాలు ఐక్యంగా యజమాన్యాల పై ఒత్తిడి చేసి,గత సంవత్సరం కన్నా 8750 రూపాయలు అధికంగా ఈ సంవత్సరం 93,750 వేల రూపాయలు పిఎల్ఆర్ బోనస్ సాధించుకోవడం జరిగిందని తెలిపారు. కార్మిక సంఘాల ఐక్యతగా ఉంటే ఈ విధంగా కార్మికులకు లబ్ది కలుగుతుందని తెలియజేయడానికి పిఎల్ఆర్ బోనస్ ఒప్పందం ఉదాహరణ అని తెలిపారు. కార్మిక సంఘాలకు కార్మికులు మద్దతు తెలిపాలని, కార్మిక సంఘాలు ఇచ్చే పిలుపులో కార్మికులందరూ పాల్గొని, కార్మిక ఐక్యతను చాటాలని పిలుపునిచ్చారు. కాగా దాదాపు 6 గంటల పాటు జరిగిన సమావేశం అనంతరం బొగ్గు గని కార్మికులకు 93,750 వేల రూపాయలు పిఎల్ఆర్ బోనస్ చెల్లించేందుకు కోలిండియా యాజమాన్యం అంగీకరించింది.

ముందుగా స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సమావేశంలో కార్మిక సంఘాలు ప్రతినిధులు కార్మికులకు పిఎల్ఆర్ బోనస్ 1,50,000 చెల్లించాలని డిమాండ్ చేయగా, యాజమాన్యం 85 వేల రూపాయలు చెల్లిస్తామని తెలిపింది. దీనిపై సుదీర్ఘంగా చర్చలు సాగాయి. అనంతరం 1,25,000 రూపాయలు చెల్లించాలని కార్మిక సంఘాలు కోరగా, దీనికి యజమాన్యం అంగీకరించలేదు. ఈ తరుణంలో కార్మిక సంఘాల నేతలు పోరాటం నిర్వహిస్తామని సమావేశం నుండి వాకౌట్ చేశారు. అనంతరం మరల మొదలైన సమావేశంలో 93, 750 వేల రూపాయలకు పిఎల్ఆర్ బోనస్ ఒప్పందం కుదిరింది. ఒకానొక తరుణంలో పిఎల్ఆర్ బోనస్ 95 వేల రూపాయలు చెల్లిస్తున్నట్లు వార్తలు వ్యాపించాయి. స్టాండర్డ్ డైజేషన్ కమిటీ సమావేశానికి కోల్ ఇండియా చైర్మన్ పిఎం ప్రసాద్ అధ్యక్షత వహించగా, యూనియన్ నాయకులు బిఎంఎస్ నుండి సుధీర్ ఘుర్డే, మజ్రుల్ హక్ అన్సారి, సిఐటియు నుండి డిడి రామానందన్, ఏఐటీయూసీ నుండి రామేంద్రసింగ్, హెచ్ఎంఎస్ నుండి నాథూలాల్ పాండే, ప్రత్యమ్నాయ సభ్యులుగా బిఎంఎస్ నుండి యాదగిరి సత్తయ్య, సిఐటియు నుండి ఆర్పి సింగ్, ఏఐటియుసి నుండి హరిద్వార్ సింగ్, హెచ్ఎంఎస్ నుండి రియాజ్ అహ్మద్ లు పాల్గొన్నారు.

2010-11 ఆర్థిక సంవత్సరంలో 21 వేల రూపాయలు పిఎల్ఆర్ బోనస్ చెల్లించగా, 2011-12లో 26 వేలు, 2012-13లో 31,500, 2013-14లో 40 వేలు, 2014-15లో 48,500, 2015-16లో 54 వేలు, 2016-17 లో 57 వేలు, 2017-18లో 60,500, 2018- 19 లో 64,700, 2019-20లో 68,500, 2020-21లో 72,500, 2021-22లో 76,500రూపాయలు, 2022-23లో 85,000 పిఎల్ఆర్ బోనస్ బొగ్గు గని కార్మికులకు చెల్లించారు. కాగా కోలిండియాలో దసరా పండుగ ముందు పిఎల్ఆర్ బోనస్ చెల్లిస్తుండగా, సింగరేణి కార్మికులకు దీపావళి పండుగకు ముందు చెల్లించడం జరుగుతుంది. సింగరేణిలో దీపావళి పండుగకు ముందు చెల్లించడం ఆనవాయితీగా వస్తున్న, లాభాల వాటా విషయంలో కార్మికులు ఆగ్రహంతో ఉన్నందున ఈ పిఎల్ఆర్ బోనస్ సైతం దసరాకు ముందే చెల్లిస్తారా అని అనుమానాలు లేకపోలేదు.