- పరిహారం పొందీ.. ప్లాట్లుగా విక్రయిస్తూ..
- గుంటల చొప్పున అమ్ముతున్న రియల్టర్లు
- అడ్డదిడ్డంగా రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులు
మంచిర్యాల, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): చెరువులను ఆక్రమించడమే కాదు దానిలోనే వెంచర్లు చేసి గుంటల లెక్క అమ్ముతున్నా అటు రెవెన్యూ, ఇటు ఇరిగేషన్ అధికారులకు సోయిరావడం లేదు. ఒకప్పుడు గ్రామ పంచాయతీలుగా ఉండి ప్రస్తుతం మున్సిపాలిటీలుగా అభివృద్ధి చెందిన ప్రాంతాల్లో ఈ దందా మరీ ఎక్కువగా సాగుతోంది. ప్రతీ రోజు అధికారుల కండ్ల ముందే ఈ చెరువుల ఆక్రమణలు, ఇండ్ల నిర్మాణాలు జరుగుతున్నా సంబంధిత అధికారులు ‘మామూలు’గా తీసుకుంటున్నారే తప్ప చర్యలు శూన్యం.
వెంచర్‌లా మారిన ఇటిక్యాల చెరువు
మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్పిపాలిటీలోనే అతి పెద్ద చెరువు ఇటిక్యాల చెరువు. వర్షాకాలం ఈ చెరువు నిజామాబాద్ జగ్దల్‌పూర్ జాతీయ రహదారి వరకు నీరు చేరు తుంది. కానీ, కబ్జాదారులు మెల్లమెల్లగా దీని ని పూడ్చుకుంటూ వస్తున్నారు. చెరువుల్లో వే సవి కాలం పూడిక తీస్తుండాలి కానీ ఇక్కడ వేసవి వచ్చిందంటే చాలు రాత్రికి రాత్రే వం vదల ట్రిప్పుల మొరం, మట్టితో పూడ్చేస్తూ పెద్ద చెరువును కాస్త చిన్న చెరువులా మార్చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులు ఇప్పటి వరకు ఈ చెరువుకు ఎఫ్‌టీఎల్ హద్దులు వేయకపోవడంతో చెరువులోనే ప్లాట్లు చేసి అమాయక ప్రజలకు విక్రయిస్తు ముంచుతున్నారు. అన్ని పార్టీల నాయకులు ఏకమై చెరువును పూడుస్తూ.. ప్లాట్లుగా చేస్తూ.. జేబులునింపుకుంటున్నారు.
మంచిర్యాల తిలక్‌నగర్ చెరువు చుట్టూ
మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు మధ్య ఉన్న తిలక్ చెరువు (రిజర్వాయర్) చుట్టూ అక్రమ వెంచర్లు వెలిశాయి. చెరువు శిఖంను ఆక్రమించి వెంచర్లుగా ఏర్పాటు చేసి అమ్ముతుంటే అధికారులు ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఆ భూమి చెరువు శిఖమా, బఫర్ జోన్‌లో ఉందా? ఇలాంటివేమి చూడకుండానే అధికారులు కళ్లుమూసుకొని పని కానిచ్చేస్తున్నారు. తిలక్‌నగర్ చెరువు చుట్టూ (కట్టవైపు మినహాయించి) రియల్టర్లు వెంచర్లు వేసి, ప్లాట్లు విక్రయిస్తుంటే రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు నిద్రపోతున్నారా? అని ప్రజలు మండిపడుతున్నారు.
అవార్డు తీసుకొని.. ఆపై అమ్ముకొని
చెరువు శిఖం, ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌ల పరిధిలో రైతుల పట్టా భూములను ప్రభుత్వం కొనుగోలు చేసింది. కానీ, వారి పాసుబుక్కులు తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయడం, రెవెన్యూ అధికారులు పట్టా కాలం నుంచి సదరు రైతుల పేర్లు తొలగించకపోవడంతో వారి పేరిటనే ఉండిపోయింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక కొత్తగా పాసుబుక్కులు జారీచేసిన సమయంలో అప్పటి రైతులందరికి తిరిగి పట్టాపాసు బుక్కులు వచ్చాయి. వాటిని ఆసరాగా చేసుకొని తిరిగి దందా షురూ చేశారు. తమకు పట్టా ఉందంటూ రెవెన్యూ అధికారులను, ఇరిగేషన్ అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ముట్టజెప్పి గుంటలుగా విక్రయించడం మొదలు పెట్టారు. గతంలో ఎంత మంది రైతులు చెరువుల చుట్టూ భూములకు పరిహారం పొందారో జిల్లా స్థాయి అధికారులు రెవెన్యూ రికార్డులు తీస్తే పెద్ద మొత్తంలో ఈ అవినీతి దందా బయటపడనుంది.
గుంట గుంటకు నాలా కన్వర్షన్.. ఆపై రిజిస్ట్రేషన్‌లు
రెవెన్యూలో ఉన్న లొసుగులను అడ్డు పెట్టుకొని రియల్టర్లు వ్యవసాయ భూమిని, చెరువుల్లోని భూములను మొదట గుంట ల చొప్పున నాలా కన్వర్షన్ చేయిస్తు ప్లా ట్లుగా అమ్ముతున్నారు. నాలా కన్వర్షన్ చే సిన భూమికి సబ్ రిజిష్ట్రార్ కార్యాలయం సులువుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవి ని వాసానికి అమోదయోగ్యంగా ఉన్నాయా? లేవా? అనేది చూడకుండా అమ్యామ్యాల కు అలవాటుపడిన అధికారులు ఇష్టమొచ్చినట్టు ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లు చేస్తూ ఇటు ప్రజలను, అటు ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. లే అవుట్ ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేష న్లు చేస్తే ప్రభుత్వానికి ఆదాయం, కొనుగో లు చేసిన వారికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.