calender_icon.png 15 November, 2024 | 6:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ ఉద్యోగుల దుస్థితి

23-07-2024 12:05:00 AM

ప్రస్తుత సమాజంలో ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ‘గంజిలో ఈగలా’ తయారైంది. ప్రభుత్వాలు మారుతున్నా పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ‘ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ’ ప్రభుత్వాలు మాటలకే పరిమితమవు తున్నాయి. అటు సమాజంలో ఇటు ప్రభుత్వంలో ఉద్యోగులు రోజురోజుకీ చులకన అవుతున్నారు. కొందరు అవినీతి ఉద్యోగుల ప్రభావం అందరిపైనా పడుతున్నది. ‘పైసలు లేనిదే పని చేయరనే’ అపవాదు వచ్చింది. సామాన్య ప్రజల్లో అయితే ‘ఉద్యోగులకేం తక్కువ, రూ. లక్షలకు లక్షల లంచాలు వస్తాయి.

రోజూ మస్తు సంపాదన ఉంటుంది. నెల జీతంతో పనేముంది’ అనే భావన నెలకొంది. వాస్తవానికి 95% పైబడి ఉద్యోగుల జీవితాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. వచ్చిన జీతం ఇంటి ఖర్చులు, నెలవారి వాయిదాలు, అప్పుల చెల్లింపులకే సరిపోవడం లేదు. కనీస అవసరాలకు సైతం ఆలోచించాల్సిన దుస్థితి కనిపిస్తుంది. అనుకోని అవాంతరాలు, అనారోగ్య పరిస్థితులు తలెత్తితే, అప్పు చేయాల్సిన దైన్య స్థితి నెలకొంటుందనడంలో సందేహం లేదు. కానీ, కొందరు అవినీతి అధికారుల సంపాదన చూసి, ‘అందరు ఉద్యోగులూ అవినీతిపరులే’ అన్న భావన సాధారణ ప్రజల్లో కలగడం 

విచారకరం. 

అధిక పని భారంతో రోగాలు

సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఉద్యోగులపై పనిభారం ఎక్కువైంది. అత్యవసర సమాచారం అందజేత పేరిట, రాష్ట్ర కార్యాలయాల నుంచి ఈమెయిల్స్ అర్ధరాత్రిళ్లూ వస్తున్నాయి. ‘వెంటనే సమాచారం కావాలని’ ఆర్డర్స్ అందుతున్నాయి. ఉదయం, రాత్రి అనే తేడా లేకుం డా పనిచేయాల్సి వస్తుంది. రాత్రంతా పని చేసినా, పొద్దున ఖచ్చితంగా బయోమెట్రిక్ అటెండెన్స్ వేయాల్సిందే. లేదంటే గైర్హాజరు పడినట్టే.  కానీ, అధిక పని గంటల పనిని ఎవరూ పరిగణలోకి తీసుకోవడం లేదు. అటెండర్ నుంచి ఆఫీసర్ వరకు పని భారంతో కుదేలవుతు న్నారు. బీపీ, షుగర్, మెడనొప్పులు, దృష్టి లోపాలు, గుం డెజబ్బులు, మానసిక ఒత్తిళ్లు ఉద్యోగులను అనునిత్యం వెంటాడుతున్నాయి. సగటున ఇద్దరు ఉద్యోగుల్లో ఒకరిని ఏదో ఒక రోగం పలకరిస్తూనే ఉంటుంది. ఎవరికి గోడు చెప్పుకున్న లాభం ఉండదు. అందుకే ‘కక్క లేక, మింగ లేక..’ అన్న దయనీయ పరిస్థితిలోకి ఉద్యోగులు వెళ్లిపోతున్నారు. 

అన్నింటికీ అనర్హులేనా?  

ప్రభుత్వ సంక్షేమ పథకాలు పక్కదారి పట్టకుండా, ప్రభుత్వ ఉద్యోగులను వీటికి అనర్హులుగా ప్రకటించడం సమంజసమే. దీన్ని ఎవరూ కాదనలేరు కూడా. కానీ, కొన్ని సందర్భాల్లో ఈ నిబంధనలు ప్రభుత్వోద్యోగ కుటుంబాలకు గుదిబండలా మారుతున్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగి పెళ్లి చేసుకుని, తన భార్యాపిల్లలతో వేరుగా ఉంటున్నప్పుడు సదరు ఉద్యోగి తల్లిదండ్రులకు అర్హతలున్నా పెన్షన్లు పొందలేకపోతున్నారు. ఉద్యోగి భార్యనో, భర్తనో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకున్నా రాయితీ పథకాలు పొందలేని నిబంధనలు అడ్డుగోడలా మారాయి. ఉద్యోగి కుటుంబంలోని పెళ్లికాని సోదరీ సోదరులు, రాయితీ పథకాలతో లభించే స్వయం ఉపాధికి దూరమవుతున్నారు.

కారణమేమిటంటే, వీరి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం లభించడమే. ఫలితంగా తెల్ల రేషన్ కార్డుకు దూరం కావడమే. ఉద్యోగి సోదర, సోదరీమణులు పెళ్లయి, సొంత కుటుంబం ఏర్పడితే తప్ప ప్రభుత్వ పథకాలు పొందలేని దుస్థితి నెలకొంది. ఇక్కడ విలువైన సమయాన్ని, ఆర్థిక ఎదుగుదలను, నిర్దేశించుకున్న లక్ష్యాలను, వ్యాపారాభివృద్ధిని సదరు ఉద్యోగి కుటుంబసభ్యులు సకాలంలో పొందలేక పోవడం అందరూ గమనించాల్సిన విషయం. ఉద్యోగులు తమ ఉద్యోగ జీవితంలో పొందే మొత్తం జీతం ఓ పారిశ్రామికవేత్త పొందే చిన్న సబ్సిడీకంటే చాలా తక్కువేనని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

కాబట్టి, తెలుగు ప్రభుత్వాలు సునిశిత దృష్టితో ఆలోచించి సంక్షేమం, స్వయంఉపాధి కల్పన, పారిశ్రామిక అభివృద్ధి విషయంలో వెసులుబాటు కల్పించాలని ఉద్యోగులు కోరుతున్నారు. అప్పుడే తలసరి ఆదాయం పెరుగుదలలో మార్పు కనిపిస్తుంది కూడా. ఉద్యోగి కుటుంబంలో ఉత్సాహమున్న వారిని పారిశ్రామిక వేత్తలుగా ప్రోత్సహించడానికి, ప్రభుత్వం విధి విధానాలను రూపొందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎలా చేస్తే అర్హులైన ఉద్యోగ కుటుంబాలకు సంక్షేమ, ఉపాధి, వ్యాపార అవకాశాలు లభిస్తాయో తేల్చేలా ఓ కమిటీ ఏర్పాటు చేసి, ఉద్యోగ కుటుంబాల్లోని అర్హులకు న్యాయం చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేస్తున్నారు.  

 కెంపుల నాగరాజు  

జిల్లా అధ్యక్షులు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ 

నిజామాబాద్ జిల్లా, సెల్: 9989075383