17-12-2024 12:00:00 AM
కలెక్టరేట్ ప్రజావాణికి
667 దరఖాస్తులు
హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16(విజయక్రాంతి): తమకు గూడు కల్పించాలని నగరంలోని పేదలు భారీగా కలెక్టరేట్ బాట పట్టారు. సొంత ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్నామని, ప్రభుత్వం నుంచి డబుల్ బెడ్రూంలు ఇవ్వండి సారూ.. అంటూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో దరఖాస్తులు సమర్పించారు. సోమవారం ఒక్కరోజే డబుల్ బెడ్రూంల కోసం ఏకంగా 667 దరఖాస్తులు వచ్చాయి.
అర్జీదారుల నుంచి అడిషనల్ కలెక్టర్లు ముకుందరెడ్డి, కదిరివన్ దరఖాస్తులు స్వీకరించారు. కాగా ప్రజావాణికి మొత్తం 728 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్‌వో వెంకటాచారి, ఆర్డీవోలు రామకృష్ణ, సాయిరాం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ శాఖల జిల్లా సంక్షేమ అధికారులు పాల్గొన్నారు.