11-02-2025 12:00:00 AM
విశ్వక్‌సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఆ చిత్రబృందానికి షాక్ తగిలింది. ఆదివారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు పృథ్వీరాజ్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి. దీనిపై విశ్వక్‌సేన్, నిర్మాత సాహు గారపాటి స్పందించారు. ఒక వ్యక్తి చేసిన తప్పుకి తమ సినిమాను చంపవద్దని విశ్వక్ సోమవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వేడుకున్నాడు.
“మా కంట్రోల్‌లో లేకుండా ఒక వ్యక్తి చేసిన తప్పుకి మా సినిమాను బలి చేయకండి. ఇది మా కైండ్ రిక్వెస్ట్. ఆ వ్యక్తికి, నాకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన కేవలం మా సినిమాలో నటించాడు. సారీ చెబితేనే కూల్ డౌన్ అవుతారని భావిస్తే నేను క్షమాపణలు కోరుతున్నాను. దయచేసి సినిమాను మాత్రం చంపకండి. ప్లీజ్ సపోర్ట్ లైలా. ఈ సినిమా నాకెంతో స్పెషల్. లేడీ గెటప్ కోసం మానసికంగా హార్డ్ వర్క్ చేశా.
ఫిబ్రవరి 14న ఉదయమే ‘లైలా’ హెచ్‌డీ ప్రింట్ లింక్ పెడతామం టూ సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. బాయ్‌కాట్ లైలా అంటూ 25 వేల ట్వీట్లు వేశారు. నేనెందుకు బలి కావాలి సర్? 100 మందిలో ఒకడు తప్పు చేస్తే 99 మందిని ఎలిమినేట్ చేసేద్దామా? సినిమా వాళ్లం కదా.. ఈజీ టార్గెట్ అయిపోతామా? అనిపిస్తోంది’ అన్నాడు విశ్వక్. సాహు గారపాటి మాట్లాడుతూ..
“నిన్న రాత్రి ఈవెంట్ తర్వాత సోషల్ మీడియాలో పోస్ట్ చూసి షాక్ అయ్యాం. నిజానికి ఆ వ్యక్తి మాట్లా డినప్పుడు నేను, హీరో గారు అక్కడ లేము. మేము చిరంజీవి గారి కోసం బయటికి వెళ్లాం. మా నోటీస్ లేకుండా అది జరిగింది. సినిమా కోసం వేల మంది పనిచేస్తారు. ఇది వేరేగా వెళ్లడం వల్ల ప్రతి ఒక్కరికి ఇబ్బంది కలుగుతుంది. సినిమాను సినిమాలాగా చూడాలని కోరుతున్నాం” అన్నారు.