పారిస్ ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈసారి వినూత్న రీతిలో నిర్వహించనుంది. ప్రతీసారి ఒలింపిక్స్‌కు ఆతిథ్యమిచ్చే దేశంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఒలింపిక్ విలేజ్‌లో ప్రారంభోత్సవ వేడుకలు నిర్వహించ డం ఆనవాయితీ. అయితే ఈసారి అందుకు భిన్నంగా పారిస్‌లోని సీన్ నదిపై ఒలింపిక్ ప్రారంభ వేడుకలు జరగనున్నాయి. సీన్ నది నుంచి ఈఫిల్ టవర్ వరకు ఫ్లోటింగ్ పరేడ్ జరగనుంది. కొన్ని వందల బోట్లలో అన్ని దేశాల అథ్లెట్లు తమ జాతీయ జెండాలతో ప్రత్యేక మార్చ్ నిర్వహించనున్నారు. ఆస్ట్రేలిట్జ్ బ్రిడ్జ్ నుంచి మొదలుకానున్న పరేడ్ .. పారిస్ కాథడ్రెల్‌ను దాటుకొని ఈఫిల్ టవర్ వరకు కొనసాగనుంది. దాదాపు 6 కిలోమీటర్ల మేర సాగనున్న ఈ పరేడ్ కన్నుల పండువగా నిర్వహించేందుకు ఒలింపిక్ కమిటీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు రాత్రి వేడుకలు జరగనున్నాయి.