calender_icon.png 20 September, 2024 | 2:51 PM

పారాహుషార్

25-07-2024 01:07:29 AM

రేపటి నుంచి పారిస్ ఒలింపిక్స్

  • అతిపెద్ద క్రీడా పండగకు వేళాయె!
  • 117 మంది సైన్యంతో భారత్ ఒలింపిక్ రింగుల కథేంటి?

ఒలింపిక్ జెండాను గమనించే ఉంటారు. అందులో ఐదు రింగులు సమాన కొలతల్లో ఉంటాయి. నాలుగేళ్లకోసారి జరిగే విశ్వక్రీడల్లో అన్ని ఖండాలకు సమాన ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతోనే ఐదు రింగులను ఒకచోట చేర్చారు. నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు ఇలా ఐదు రంగులు ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉంటాయి. ఈ ఐదు రింగులు ప్రపంచంలోని 5 ప్రధాన ఖండాలకు ప్రతీక. ఆసియా, ఆఫ్రికా, అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా ఖండాలకు ప్రతీకగా ఒలింపిక్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు పియర్ డు కుబెర్టిన్ దీన్ని రూపొందించారు. 1896 తొలి ఒలింపిక్స్ నుంచే ఈ రింగులను ఉపయోగిస్తున్నారు. రింగుల్లో ఈ ఐదు రంగులనే ఎందుకు వాడుతున్నారంటే.. ప్రపంచంలోని ప్రతీ దేశం తమ జాతీయ జెండాలో ఐదు రంగుల్లో ఒక రంగును కచ్చితంగా ఉపయోగిస్తుంది. 1914లతో ఒలింపిక్ జెండాను రూపొందించారు. 

సరికొత్త ఆటలు..

ప్రతీసారి ఒలింపిక్స్‌లో కొత్త క్రీడలను ప్రోత్సహించడం ఆనవాయితీ. విశ్వక్రీడలను నిర్వహించే ఆతిథ్య దేశానికి కొత్త ఆటలను ప్రవేశపెట్టే హక్కును అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) కల్పిస్తూ వస్తోంది. ఇలాంటి కొత్త ఆటలు క్రీడాభిమానులను ఆకర్షించేందుకు పనికొస్తాయనేది ఐవోఏ ముఖ్య ఉద్దేశం. ఈసారి పారిస్ ఒలింపిక్స్ ద్వారా బ్రేక్ డ్యాన్స్‌కు విశ్వజనీనత లభించనుండగా.. టోక్యో ఒలింపిక్స్‌లో ప్రవేశపెట్టిన స్కేట్ బోర్డింగ్, సర్ఫింగ్, స్పోర్ట్స్ క్లుంబింగ్‌ను ఈసారి కూడా కొనసాగించనున్నారు. మిగతా క్రీడలు ఎలా ఉన్నా బ్రేక్ డ్యాన్సింగ్ మాత్రం కాస్త కొత్తదనంగా కనిపిస్తోంది. శారీరక కదలికలు, ఫుట్‌వర్క్ స్టయిల్ తదితర అంశాలతో పాయింట్లు కేటాయించి విజేతలను నిర్ణయించనున్నారు.  

రష్యా, బెలారస్‌కు నో చాన్స్

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. పారిస్ ఒలింపిక్స్‌లో రష్యా, బెలారస్ అథ్లెట్లపై నిషేధం విధించారు. అయితే ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు విశ్వక్రీడల్లో తటస్థ అథ్లెట్లుగా బరిలోకి దిగే అవకాశం కల్పించారు. అంటే ఈ రెండు దేశాలకు చెందిన అథ్లెట్లు పతకాలు గెలిస్తే.. వారి దేశ జెండాలను ప్రదర్శించే వీలు లేదన్నమాట. వీరితో పాటు శరణార్థుల ఒలింపిక్ జట్టు కూడా పారిస్ బరిలో ఉంది.

అథ్లెట్లు ఏం తింటారు?

విశ్వక్రీడల్లో ఆటలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో.. అథ్లెట్లు తినే తిండికి కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఫ్రాన్స్, ఆసియా, ఆఫ్రికా స్టుల్ వంటకాలతో ఈసారి ఒలింపిక్ విలేజ్ గుమగుమలాడనుంది. వేగన్ చికెన్ నగ్గెట్స్, వేగన్ హాట్ డాగ్స్, భారతీయ వంటకాలైన థాలీ రైస్, బాస్మతీ రైస్, బేకడ్ పొటాటో, కాలీఫ్లవర్, వెగ్గీ మౌసాకా అందులో మచ్చుకు కొన్ని. ఇక మొత్తం విశ్వక్రీడలకు 13 మిలియన్ మీల్స్ అవసరం కానున్నట్లు అంచనా. ఒలింపిక్ విలేజ్‌లో 3500 మంది ఒకేసారి కూర్చొని తినే మల్టీ గ్లోబల్ రెస్టారెంట్‌ను కూడా తాత్కాలికంగా నిర్మించారు.