ఐ.వి.మురళీకృష్ణ శర్మ :
ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పి దాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడిచిన ప్రజా వ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపైకూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్‌ఎస్ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది.
తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండుసార్లు స్పష్టమైన మెజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్దేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీ ర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీలనుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు తెరదీశారు.
ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలా న్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదా లు వుండేవి కావు. కేసీఆర్ ఇందుకు భిన్నం గా చట్టంలోని లొసుగులను అనుకూలం గా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవిం చారు. కొందరికి మంత్రి హోదాకూడా దక్కింది.
కేసీఆర్ బాటలోనే కాంగ్రెస్
కేసీఆర్ చర్యలను ప్రతిపక్ష కాంగ్రెస్ ఐదే ళ్లూ ఎండగడుతూనే వచ్చింది. అప్పటి టీపీసీసీ చీఫ్, ప్రస్తుత మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రజాతీర్పును ఉల్లంఘిస్తూ ‘ప్రతిపక్షం లేకుండా చేయాలని కేసీఆర్ చూస్తే ప్రజలు ఆయనను అధికారం నుం డి దింపేస్తారు’ అని విమర్శించారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా అప్పటి సీఎల్పీ నేత, ప్రస్తుత డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క 36 గంటల నిరాహార దీక్ష చేశా రు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఈ అంశాన్ని లేవనెత్తుతూ, ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను అసెంబ్లీ గేటు తాకనివ్వను. భవిష్యత్తులో ఎవరైనా ఫిరాయించాలంటే వందసార్లు ఆలోచించేలా వారిని బండకేసి కొట్టాలి’ అని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫిరాయింపులపై పలు నీతి మాటలు చెప్పిన కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవే తప్పిదాలకు తెరలేపుతూ ఇప్పుడు చేరికలను ప్రోత్సహిస్తోంది.
బీఆర్‌ఎస్ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపా లను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడించారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీర్చుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోం ది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేంద ర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రె స్ మరింతమంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలో ని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్ అడుగులేస్తోంది.
ప్రజాకోర్టులో తప్పని శిక్ష
అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజాకోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్ రెడ్డి మాత్రమే గెలవగా, మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాంది పలికినట్టేనని గత అనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజక వర్గాల్లో ఆధిప త్య పోరు కేసీఆర్ సర్కారు పుట్టి ముంచా యి.
ఇటువంటి ఘటనలను కొన్ని పరిశీలిస్తే 2018లో కొల్లాపూర్ నుండి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డిని బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నాక ఆయన చేతిలో ఓడిపోయిన బీఆర్‌ఎస్ సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు నిత్యం ఆయనతో ఘర్షణ పడుతూనే 2023 ఎన్నికల ముం దు కాంగ్రెస్‌లో చేరి, గెలిచి ఏకంగా మంత్రి అయ్యారు. ఈ విధంగానే నకిరేకల్‌లో వేముల వీరేశం, పినపాకలో పాయం వెంకటేశ్వర్లు, ఇల్లందులో కోరం కనకయ్య అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్ నుం డి కాంగ్రెస్‌లో చేరి గెలిచారు. 2016లో పాలేరు ఉప ఎన్నికల్లో బీఆర్‌ఎస్ నుండి గెలిచిన తుమ్మల నాగేశ్వరరావు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ఉపేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో వీరిద్దరి మధ్య విభేదాలు రావడం తో తుమ్మల 2023 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ తరఫున ఖమ్మం నుండి గెలిచి మంత్రి అయ్యారు.
పై ఉదంతాలను గమనిస్తే వలసలొచ్చే ఎమ్మెల్యేలతో సొంత పార్టీలో అసంతృప్తి జ్వాలలతో ఆయా నియోజక వర్గాల్లో పార్టీ బలోపేతం కావడం కంటే బలహీన పడ్డట్టు కనిపిస్తుంది. ఇటీవల గద్వాల్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పార్టీ మారనున్నారనే వార్తల నేపథ్యంలో ఆయన చేతిలో ఓడిపోయిన కాంగ్రెస్ అభ్యర్థి సరిత తిరుపతయ్య తమ రాజకీయ భవిష్యత్తు బెంగతో ఆయన రాకను వ్యతిరేకిస్తూ కంటనీరు పెట్టారు. ఈ పార్టీ ఫిరా యింపులతో బీఆర్‌ఎస్ చేతిలో ఓడిన కాంగ్రెస్ నేతల్లో ఆందోళన మొదలైతే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో సదరు నియోజక వర్గా ల్లో అంతర్గత యుద్ధం ఖాయం.
ప్రజల అసంతృప్తి
వలస రాజకీయాలపై ప్రజలు ఎంత అసంతృప్తిగా ఉంటారో ఇటీవల పార్లమెం ట్ ఎన్నికల ఫలితాలే తార్కాణం. 2023 లో ఖైరతాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కనీసం ఆ పార్టీకి రాజీనామా కూడా చేయకుండా సికింద్రాబాద్‌లో కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తే ప్రజ లు ఓడించారు. లోక్‌సభ ఎన్నికల ముం దు దానం నాగేందరే కాకుండా బీఆర్‌ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్ రెడ్డిని చేవెళ్లలో, పట్నం సునితా మహేందర్ రెడ్డిని మల్కాజిగిరిలో, బీఆర్‌ఎస్ నుండి బీజేపీలో చేరిన బీబీపాటిల్‌ను జహీరాబాద్‌లో, పి.భరత్‌ను నాగర్ కర్నూల్‌లో, సైదిరెడ్డిని నల్గొండలో, ఆరూరి రమేశ్‌ను వరంగల్‌లో, బీఎస్పీ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ను నాగర్ కర్నూల్‌లో ఎంపీగా పోటీ చేయిస్తే అరువు వచ్చిన ఈ నేతలను ఓటర్లు ఓడించారు.
దేశమంతా ఇదే జాడ్యం
తెలంగాణలోనేకాక దేశ వ్యాప్తంగా ప్రజాప్రతినిధుల ఫిరాయింపుల జాడ్యం ఉంది. గతంలో బీజేపీ కర్ణాటకలో ఇవే చర్యలు చేపట్టి చివరికి అధికారాన్నే కోల్పోయింది. మహారాష్ట్ర, హర్యానాలోనూ బీజే పీ వలసలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీలను చీల్చి ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో భంగపడిన విషయం గమనార్హం. ఫిరాయింపులపై గత అనుభవాలను పరిగణ లోకి తీసుకోకుండా అప్పుడు కేసీఆర్ చేశారు కదా, ఇప్పుడు మేము కూడా అదే చేస్తామంటూ చేరికలను ప్రోత్సహించడం ప్రజాస్వామ్యానికి ఆరోగ్యకరం కాదు. చేరికలపై గతంలో కేసీఆర్‌ను ఎండగట్టిన కాం గ్రెస్ ఇప్పుడు ఫిరాయింపులపై గతంలో తాము చేసిన వ్యాఖ్యలపైనే ప్లేటు ఫిరాయించడం ఫక్తు అవకాశవాద రాజకీయం.
వ్యాసకర్త పొలిటికల్ అనలిస్ట్,
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ