- మొక్కల పెంపకంపై నివేదిక ఇవ్వాలి
- హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, ఆగస్టు 1(విజయక్రాంతి): మొక్కల పెంపకం భవిష్యత్తరాల కోసం అని అందరూ గుర్తు చేసుకోవాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. మొక్కల పెంపకానికి చేపట్టిన చర్యలపై సమగ్ర నివేదిక సమ ర్పించాలని హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీకి గురువారం ఆదేశాలు జారీచేసింది. కార్యాచరణ ప్రణాళికసహా నివే దిక సమర్పించని పక్షంలో కమిషనర్ల హాజరుకు అదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. జనాభాకు తగ్గట్టుగా చెట్ల పెంపకం పార్కులు, పచ్చదనం ఉండటం లేదని, పార్కులకు కేటాయించిన స్థలాల పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ కే ప్రతాప్‌రెడ్డి ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జీహెచ్‌ఎంసీ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మొక్కల పెంపకానికి సంబంధించిన నివేదికను సమర్పించామని అన్నారు. సమగ్ర నివేదికకు మరికొంత గడువు కావాలని కోరారు. ఈ నివేదికను పరిశీలించిన ధర్మాసనం తీవ్ర అసంతప్తి వ్యక్తం చేసింది. 10 మేజర్ పార్కులున్నాయి, 1000 బయో పార్కులున్నాయి, 10 మైదానం పార్కులు, 138 ట్రాఫిక్ కూడళ్ళు ఉన్నాయని, శ్మశానాలను అభివద్ధి చేస్తున్నామంటూ చెప్పడాన్ని తప్పుబట్టింది. గణాంకాలు కాదని మొక్కల పెంపకానికి ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలంటే అది చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తంచేసింది.
ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యం ఎనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉందని, ఇటీవల ఆరేడుసార్లు విచారణకు వచ్చిందని, ప్రతిసారీ గడువు కోరుతూ వస్తున్నారనిమండిపడింది. కోర్టు చెప్తున్నదని అధికారులపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత న్యాయవాదులపై ఉందని చెప్పింది. అలాకాకపోతే బాధ్యులైన అధికారులు స్థల వివరాలిస్తే వారిని కోర్టుకు హాజరుకావాలని ఆదేశించి వివరణ అడుగుతామని హెచ్చరించింది. ఈ దశలో అదనపు అడ్వొకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్‌ఖాన్ వాదనలు వినిపిస్తూ.. 50 లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యమని చెప్పారు. అందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వాదనలను విన్న ధర్మాసనం కార్యాచరణకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ విచారణను 8కి వాయిదా వేసింది.