calender_icon.png 6 October, 2024 | 3:48 AM

రోజుకో మొక్క.. ప్రకృతి సంరక్ష!

06-10-2024 01:13:44 AM

నిత్యం ఒక మొక్క నాటుతున్న సింగరేణి కార్మికుడు 

మొక్కలనే ఇంటి పేరుగా మార్చుకొన్న భద్రాద్రి జిల్లాకు చెందిన నుర్వి రాజశేఖర్

ఇప్పటివరకు 1,555 మొక్కలు నాటి రికార్డు 

ప్రకృతిని సంరక్షించాలన్న దృఢ సంకల్పం.. నిస్వార్థంతో మొక్కలు నాటాలన్న ఆశయం.. మొక్కవోని పట్టుదలతో రోజుకో మొక్క నాటారాయన.. ఇంటి పేరు సైతం మొక్కల రాజశేఖర్‌గా గుర్తింపు పొందారు.. అతనెవరో కాదు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం సమీపంలోని రామవరం గ్రామానికి చెందిన నుర్వి రాజశేఖర్. తన తండ్రి చూపిన మార్గంలో ప్రకృతి సంరక్షణకు అడుగులు వేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.

2020 జూలై 1న డాక్టర్స్ డేను పురస్కరించుకొని రోజుకో మొక్క నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ఈ సింగరేణి బిడ్డ.. ఇప్పటివరకు 1,555 మొక్కలు నాటి ఔరా అనిపించాడు. గత నెల ౨౯న ప్రధాని నిర్వహించిన ‘మన్‌కీ బాత్’లో నరేంద్రమోదీ.. రాజశేఖర్ కృషిని ప్రస్తావించడం, అభినందించడం ఈ హరిత ప్రేమికుడికి దక్కిన విశేష గౌరవం. ఈ సందర్భంగా ఆయన ‘విజయక్రాంతి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..

రోజుకో మొక్క నాటి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన నుర్వి రాజశేఖర్. తాను మొక్కలు నాటడంతోపాటు తనలా మరికొందరిని తయారు చేసేందుకు ఆయన కృషిచేస్తన్నారు. ఈ నేపథ్యంలో విజయక్రాంతికి ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చారు.  ఆయన మాటల్లోనే..

నాన్నే నాకు స్ఫూర్తి

మా తండ్రి కొట్టూరు పాండు నాకు స్పూర్తి. నా 11వ ఏట నుంచే మొక్కలపై మక్కువ పెంచారు. వృత్తి రీత్యా నాన్న టైలర్. టైలరింగ్ చేస్తూనే మొక్కలు నాటడం, వాటి ప్రాముఖ్యతను చెప్పేవారు. వాటిని సంరక్షించే బాధ్యతను చూడాలని సూచించేవారు. ఆనాటి నుంచి వీలు కుదిరిన సమయాల్లో మొక్కలు నాటుతున్నాను. 

కొమ్మలు విరిచినా సహించకపోయేది

నా చిన్నతనం నుంచే నాకు మొక్కల పెంపకంపై ఆసక్తి పెరిగింది. సమాజానికి అవి చేసే మేలు నన్ను ఆ దిశగా మార్చింది. నా ముందు ఎవరైనా చెట్లను నరికినా, మొక్కల కొమ్మలు విరిసినా సైతం ఆపేవాడిని.  

ప్రత్యేక సందర్భాల్లో మొక్కలు పెంపు

పండుగ రోజుల్లో, శుభకార్యాల సందర్భంగా, పదవీ విరమణ, ప్రమాణ స్వీకారం, చివరకు ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు మొక్కను పంపిణీ చేసేవాడిని. దాని ప్రాముఖ్యతను వివరిస్తూ వారితో మొక్కలను నాటించేవాడిని. 

ఎవరి నుంచీ పైసా ఆశించలేదు

మొక్కలు నాటే కార్యక్రమం కోసం నేను ఎవరి నుంచీ పైసా ఆశించలేదు. నా జీతం నుంచే మొక్కల పెంపకానికి ఖర్చు చేస్తున్నాను. నేనే గింజలు తెచ్చి, వాటిని నాటి పెరిగిన మొక్కలను ప్రజలకు పంచుతుంటా. వినూత్న ప్రచారంతో అవగాహన 

నా వాహనంపై ‘ప్రకృతి హరిత దీక్ష భావితరాలకు రక్ష’ అనే నినాదంతో కూడిన స్టిక్కర్ ఏర్పాటుచేసుకుని వాహన కాలుష్యంపై ప్రచారం చేస్తున్న. ‘ప్లాస్టిక్ బొకేలు వద్దు.. పచ్చని మొక్కలు ముద్దు’ అని ప్లాస్టిక్ వాడకం తగ్గించేందుకు ప్రచారం చేపట్టిన. పండుగల సందర్బాల్లో దేవున్ని పూజించే ముందు మొక్కలను పూజించి, వాటిని నాటేలా అవగాహన కల్పించిన.

గణేశ్ నవరాత్రుల సందర్భంగా మట్టి విగ్రహాలు పంచుతూ దాని వెనుక భాగంలో మొక్కను అతికించి పంపిణీ చేశాను. పదవీ విరమణ, ప్రమాణ స్వీకారం, నూతన బాధ్యతలు చేపట్టిన అధికారులకు బొకేలకు బదులుగా మొక్క అందించే సంప్రదాయాన్ని నేనే ప్రారంభించా. ఉద్యోగ సమయం ముగిసిన తర్వాత రెండు గంటలపాటు మొక్క నాటే కార్యక్రమానికి సమయం కేటాయిస్తాను. నా భార్య కల్పన నాకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. 

ప్రధాని ప్రశంస మరిచిపోను

పర్యావరణ పరిరక్షణ కోసం నేను చేస్తున్న కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించడం ఎప్పటికీ మరిచిపోను. పెద్దగా చదువుకోకున్నా నాకు ప్రకృతిపై గల మక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. నేను చేపట్టిన ప్లాస్టిక్ వస్తువుల నివారణపై చేపట్టిన కార్యక్రమాన్ని మెచ్చుకొని 2023లో ప్రస్తుత సింగరేణి సీఎండి బలరాం చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నా.

2019లో సింగరేణి అప్పటి సీఎండీ చంద్రశేఖర్  చేతుల మీదుగా ప్రశంస పత్రం, 2021లో హర్పల్ నర్సరీల ఏర్పాటుకు మెచ్చుకొని ఈఎన్‌ఎం డైరెక్టర్ డీ సత్యనారాయణ అభినందన ప్రతం అందుకున్నాను. 2024లో ప్రస్తుత కలెక్టర జితేష్ వీ పాటిల్ కలెక్టరేట్‌లో సన్మానించి గౌరవించారు. ఇలా నేను చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమంతో వచ్చిన గుర్తింపు.. ఇతరులకు స్ఫూర్తినిస్తుందని అనుకుంటున్నా. 

భద్రాద్రి కొత్తగూడెం, 

అక్టోబర్ ౫ (విజయక్రాంతి)