calender_icon.png 17 October, 2024 | 6:01 AM

20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు

17-10-2024 02:04:13 AM

రైతులకు పంటతోపాటు పవర్ పైనా ఆదాయం వచ్చేలా చర్యలు

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క 

హైదరాబాద్, అక్టోబర్ 16 (విజయక్రాంతి):  రాష్ట్రంలో 20 వేల మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తికి ప్రణాళికలు చేస్తున్నామని, రైతులకు పంటతోపాటు పవర్ ఉత్పత్తి చేయడం ద్వారా ఆదాయం వచ్చేలా చర్యలు చేపడుతున్నామని, దీనికి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు పైలెట్ ప్రాజెక్టు ద్వారా ముందుకు పోతున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బుధవారం సాయంత్రం హైదరాబాద్ కళ్యాణ్ నగర్‌లో తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ కార్యాలయ నూతన భవననాన్ని ప్రారంభించిన అనంతరం డిప్యూటీ సీఎం ప్రసంగించారు. పేద కుటుంబాలు ఆర్థికంగా ఎదిగేం దుకు 200 యూనిట్ల విద్యుత్‌ను ఉచితంగా సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. రెగ్యులేటరీ కమిషన్ పెట్టుబడిని లెక్కించి, ప్రజలపై భారం మోపకుండా నియంత్రిస్తుందని తెలిపారు.

రాష్ట్రంలో అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ దేశ జీడీపీని పెంచేందుకు కృషి చేస్తున్నట్టు వెల్లడిం చారు. ప్రభుత్వ విద్యాసంస్థలు ఉన్నతంగా ఎదిగేందుకు ఇబ్బందులు లేకుం డా ఉచితంగా విద్యుత్‌ను సరఫరా చేస్తున్నట్టు స్పష్టంచేశారు.

రాబోయే పదేళ్లకు కావాల్సిన పీక్ డిమాండ్‌ను అందుకునేందుకు విద్యుత్ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని వెల్లడించారు. త్వరలోనే రెగ్యులేటర్ కమిషన్ సిబ్బంది కొరతను తీరుస్తామని తెలిపారు. కార్యక్రమంలో  రెగ్యులేటరీ కమిషన్ చైర్మన్ రంగారావు, టెక్నికల్ మెం బర్ మనోహర రాజు, ఫైనాన్స్ మెంబర్ కృష్ణ య్య, సీఎండీలు తదితరులు పాల్గొన్నారు.