calender_icon.png 31 January, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి

29-01-2025 12:00:00 AM

  1. ఆందోల్  జోగిపేట మున్సిపాలిటీ లో మంత్రి సుడిగాలి పర్యటన 
  2. పట్టణంలో గాంధీ పార్క్ ను అభివృద్ధి చేయాలి
  3. ఆందోల్ చెరువు లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం కల్పించాలి
  4. ట్యాంక్ బండ్‌ను ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి
  5. అధికారుల సమీక్షలో మంత్రి దామోదర రాజనర్సింహ దిశా నిర్దేశం

అందోలు, జనవరి 28 : ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ అభివృద్ధిపై మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మున్సిపాలిటీలో సుడిగాలి పర్యటన చేశారు. 

ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నా ఆందోల్ పట్టణానికి తలమానికంగా నిలిచిన ట్యాంక్ బండ్ ను పర్యాటకుల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.

ఆందోల్ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం, రెస్టారెంట్ ఏర్పాటు, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, వాకింగ్ ట్రాక్ నిర్మాణం పై ఆయన చర్చించారు. ఈ సమీక్షలో పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ, మున్సిపల్ ఆఫీస్ పనుల పురోగతిపై చర్చించారు. ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ ఉన్నా గాంధీ పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి  ఆదేశించారు.

అలాగే పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియం లో వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ గ్రౌండ్ లలో మౌలిక సదుపాయాల కల్పన తో పాటు మల్టీ పర్పస్ స్టేజ్ ను నిర్మించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ సమీక్షలో ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్‌ఐసీ) 30 కోట్ల 20 లక్షల రూపాయల నిధులతో చేపడుతున్న 34 పనుల పురోగతి పై ప్రజారోగ్య శాఖ అధికారులతో మంత్రి  చర్చించారు. మున్సిపాలిటీ లో చేపడుతున్నా పనులను వెంటనే పూర్తి చేయాలనీ మంత్రి  అధికారులను ఆదేశించారు.

ఈ పర్యటనలో ఆందోల్ లో నిర్మించనున్న ప్రతిపాదిత ఏం. ఫార్మసీ కళాశాల, ఇతర విద్యాసంస్థల ఏర్పాటు కు స్థల పరిశీలన ను స్థానిక ఆర్డిఓ, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయి లో పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యాసంస్థల ఏర్పాటుకు అవసరమైన ల్యాండ్ బ్యాంకును సమకూర్చాలని మంత్రి రెవిన్యూ అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో ఆందోల్ డివిజన్ ఆర్డిఓ పాండు నాయక్, పబ్లిక్ హెల్త్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తిరుపతి కుమార్, ఆందోల్ - జోగిపేట మున్సిపల్ కమిషనర్ తిరుపతి, వివిధ శాఖల అధికారులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.