రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి): వాటర్ స్పోర్ట్స్‌కు ప్రస్తుతం ఆదరణ పెరిగిందని, ఈ ప్రాధాన్యతను గుర్తించి ప్రభుత్వం జల విహార అభివృద్ధికి పూనుకుంటున్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. నగరంలోని హుస్సేన్ సాగర్‌లో బుధవారం ఆయన అమరావతి బోటింగ్ క్లబ్ ఏర్పాటు చేసిన వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు జల, సాహస క్రీడలను ప్రవేశపెట్టనున్నదని తెలిపారు.
దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా నీటి వనరులను పరిశీలిస్తున్నామన్నారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందన్నారు. చాలా చోట్ల ప్రభుత్వ స్థలాలు, ఆస్తులు నిరర్ధకంగా ఉంచిందన్నారు. వాటిని ఉపయో గంలోకి తెచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ప్రభుత్వ-, ప్రైవేటు భాగస్వామ్యం తో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, మెనేజింగ్ డైరెక్టర్ ప్రకాశ్‌రెడ్డి, అమరావతి బోటింగ్ క్లబ్ సీఈవో తరుణ్ కాకాని తదితరులు పాల్గొన్నారు.
34 చెరువులు, రిజర్వాయర్లలో..
రాష్ట్రంలోని 34 చెరువులు, రిజర్వాయర్లను అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ కేంద్రాలుగా తీర్చిద్దాలని ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. వాటిలో హుస్సేన్‌సాగర్, కోటి లింగాల చెరువు, రామప్ప చెరువు, కరీంనగర్ ఎల్‌ఎండీ తదితర నీటి వనరులు ఉన్నాయి. సర్కార్ మొదట హైదరాబాద్‌లో వాటర్ స్పోర్ట్స్‌ను ప్రారంభించి, తర్వాత దశల వారీగా మిగతాచోట్ల ఆరంభించాలని టూరిజం శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.