calender_icon.png 2 November, 2024 | 3:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్లపై ప్రార్థనా మందిరాల తొలగింపునకు ప్రణాళికలు

02-11-2024 12:41:22 AM

  1. గ్రేటర్‌వ్యాప్తంగా 621 గుర్తింపు 
  2. దశల వారీగా తొలగించేందుకు బల్దియా కసరత్తు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ ౧ (విజయక్రాంతి): హైదరాబాద్ నగరంలోని రహదారులపై ఉన్న పలు ప్రార్థనా మందిరాలను తొలగించేందుకు బల్దియా కసరత్తు చేస్తోంది. తద్వారావాహనదారుల సమస్యలను పరిష్కరించాలని జీహెచ్ ఎంసీ పట్టణ ప్రణాళికా విభాగం భావిస్తోంది.

రహదారులపై ఉం డే ప్రార్థనా మందిరాలను తొలగించాలని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. దీంతో గతంలో సిద్ధం చేసిన ప్రణాళికను ఆచరణలో పెట్టేందుకు బల్దియా అధికారులు సమాలోచన చేస్తున్నారు.   

ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు..

నగరంలో అంతర్గత రహదారులతో పాటు ప్రధాన రహదారుల్లోనూ వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలిగించే ప్రార్థనా మందిరాలు అనేకం ఉన్నాయి. గతంలో వీటిని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నించినప్పటికీ పలు సంస్థలు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ముం దుకు సాగలేదు.

పైగా విషయం వివాదాస్పదంగా మారడంతో సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే వరకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. ఇదే విషయంపై ఇటీవల హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, భారత్ లౌకిక దేశం అయినందున న్యాయస్థానాలు ఏ మతాలకు, మరే విశ్వాసాలకు అనుగుణంగా ఉండవని స్పష్టం చేశాయి.

పబ్లిక్ రోడ్డు, ఫుట్‌పాత్, వాటర్ బాడీ, రైల్వే లైన్ తదితర ప్రాంతాలలో మార్గం మధ్యలో గురుద్వారా, దర్గా, ఆలయం తదితర మతపరమైన నిర్మాణాలు ప్రజలకు ఆటంకం కలిగించవద్దంటూ న్యాయస్థానాలు పేర్కొన్నాయి. వీటితో పాటు నగరంలో రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ కారణంగా గ్రేటర్ రహదారులను ప్రమాదరహితంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతోంది. 

6 జోన్లలో 621.. 

గ్రేటర్‌వ్యాప్తంగా 6 జోన్లలో 30 సర్కిళ్ల పరిధిలో వివిధ మతాలకు సంబంధించి రహదారులకు అడ్డంకిగా ఉన్న 621 ప్రార్థ నా మందిరాలను బల్దియా అధికారులు గుర్తించారు. దీనికి ముందుగా ఆయా మతసం స్థలకు చెందిన ప్రతినిధులతో చర్చించి, వారి అభిప్రాయాలను సేకరించి, అంగీకారం తీసుకోవడానికి బల్దియా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఆ తర్వాత న్యాయ పరమైన, చట్టపరమైన సమస్యలు ఏమైనా ఉంటే వాటి ని పరిష్కరించేందుకు దృష్టి కేంద్రీకరించాలని భావిస్తోంది. ప్రార్థనా మందిరాలను తొలగించనున్న నేపథ్యంలో వాటికి ప్రత్యామ్నా య మార్గాన్ని కూడా సూచిం చే అవకాశాలు ఉన్నాయి. ఈ నిర్మాణాలను మొత్తం మూడు దశల్లో తొలగిం చేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.