ప్రతి మండలంలో అవసరమైన మేర యూరియా స్టాక్ అందుబాటులో పెట్టుకొవాలి..
ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్, ఎరువుల లభ్యతపై రివ్యూ లో కలెక్టర్ కోయ శ్రీహర్ష..
పెద్దపల్లి (విజయక్రాంతి): జిల్లాలో లాభసాటి పంట ఆయిల్ ఫామ్ సాగు పెంపుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ లో ఆయిల్ ఫామ్ మొక్కల గ్రౌండింగ్, ఎరువుల లభ్యతపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రస్తుత సంవత్సరంలో మన జిల్లాలో 750 ఎకరాలలో ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ జరిగిందని, ఈ సంఖ్యను నిర్దేశిత లక్ష్యం మేరకు 1000 ఎకరాలకు తీసుకొని పోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ సాగు పురోగతిపై వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ అధికారులు రెగ్యులర్ మానిటరింగ్ చేయాలన్నారు.
జిల్లాలో పెద్ద రైతులను ముందుగా లక్ష్యం చేసుకొని, ఆయిల్ పామ్ సాగు వల్ల కలిగే ఉపయోగాలు వివరిస్తూ, వారిలో ఉన్న భూమిలో కొంత మేర ఆయిల్ పామ్ కు డైవర్ట్ అయ్యేలా చూడాలన్నారు. ఆయిల్ పామ్ సాగుకు ఆసక్తి కనబర్చే రైతుల నుంచి త్వరితగతిన మొక్కలకు, డ్రిఫ్ట్ కు డీడీలు కట్టించాలని అన్నారు. ఆయిల్ పామ్ మొక్కలు నాటిన రైతుకు సబ్సిడీ అందేలా చూడాలని, డ్రిప్ ఇరిగేషన్ సౌకర్యం వేగవంతంగా పూర్తి చేయాలని, జిల్లాలో రైతులకు అవసరమైన మేర ఎరువుల స్టాక్ అందుబాటులో ఉందన్నారు. ప్రతి మండలంలో అవసరమైన మేర యూరియా స్టాక్ అందుబాటులో పెట్టుకొవాలని, ఎక్కడ ఎటువంటి కొరత రావడానికి వీలు లేదన్నారు. మండలంలో ప్రైవేట్ వ్యాపారుల వద్ద ఉన్న స్టాక్ తనిఖీ చేస్తూ ఎక్కడ కృత్రిమ కొరత సృష్టించకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు. ఎరువుల కొరత సంబంధించి ఎక్కడైనా చిన్న సమస్య వచ్చిన వెంటనే స్పందించాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో డి.హెచ్.ఎస్.ఓ జగన్మోహన్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి ఆదిరెడ్డి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.