ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి..
సీసీ రోడ్డు నిర్మాణానికి రూ.10 లక్షల సొంత నిధులు
పటాన్ చెరు (విజయక్రాంతి): పటాన్ చెరు నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీల అభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా నిధులు కేటాయిస్తున్నామని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఆదివారం అమీన్ పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్ గూడ సాయి యాక్సిస్ హోమ్స్ కాలనీలో రూ.60 లక్షలతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్డును స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో గ్రామాలు పట్టణాలుగా అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు.
అమీన్ పూర్ మండల పరిధిలోని గ్రామాలు మున్సిపాలిటీలో విలీనం కావడం మూలంగా పెద్ద ఎత్తున నిధులు మంజూరు కావడంతో పాటు అభివృద్ధి శరవేగంగా కొనసాగుతుందని తెలిపారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని కోరారు. రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే జిఎంఆర్ రూ.10 లక్షల సొంత నిధులను అందించారు. ఈ కార్యక్రమంలో అమీన్ పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, వైస్ చైర్మన్ నందారం నరసింహా గౌడ్, మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ జెడ్పిటిసి సుధాకర్ రెడ్డి, శ్రీకాంత్, కాలనీ సంక్షేమ సంఘం ప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.