calender_icon.png 3 October, 2024 | 5:53 AM

మురుగు నివారణకు ప్రణాళిక

03-10-2024 01:36:01 AM

  1. గ్రేటర్‌లో సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యల నివారణకు, ఇంకుడు గుంతల నిర్మాణానికి జలమండలి సిద్ధం
  2. పోస్టర్‌ను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి
  3. ఇంకుడు గుంతల నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గ్రేటర్‌లో సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యల నివారణకు, ఇంకుడు గుంతల నిర్మాణానికి చేపట్టిన మూడు నెలల ప్రత్యేక ప్రణాళిక అమలుకు జలమండలి సిద్ధమైం ది.

మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా బుధవారం లంగర్‌హౌస్‌లోని బాపూఘాట్‌లో నివాళులర్పించి అనంతరం జలమండలి ఆధ్వర్యంలో రూపొందించిన వాల్‌పోస్టర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించి 90 రోజుల ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. 

ఇంకుడు గుంతల నిర్మాణం సామాజిక బాధ్యత : మంతి పొన్నం ప్రభాకర్

ఇంకుడు గుంతల నిర్మాణం సామాజిక బాధ్యత అని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బుధవారం మెహదీపట్నంలోని సరోజినినాయు డు కంటి ఆసుపత్రి ఆవరణలో జలమండలి ఆధ్వర్యంలో చేపట్టిన ఇంకుడు గుంతల నిర్మాణం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నగరంలోని మురుగు సమస్యల నివారణ, భూగర్భ జలాలను పెంపొందించేందుకు జలమండలి గొప్ప కార్యక్రమాన్ని తీసుకుందన్నారు. అక్టోబర్ 2 నుంచి డిసెంబర్ 31 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతోందని తెలిపారు. నగరంలో ప్రతిరోజు 1950 ఎంఎల్‌డీల మురుగు ఉత్పత్తి అవుతోందని, దాని నివారణ కోసం రూ.వందల కోట్లతో ప్రభుత్వం ఎస్టీపీలను నిర్మిస్తోందని చెప్పా రు.

నగరంలో సీల్డ్ మ్యాన్‌హోల్స్ ఉండేలా చర్యలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. నగరంలో భారీ వర్షం పడుతున్నా భూగర్భ జలాలు పెరగడం లేదని, భవిష్యత్‌లో నీటి కరువు రాకుండా ఉండేందుకు ప్రతి ఇంటి ప్రాంగణంలో ఇంకుడు గుంత నిర్మించుకోవాలని సూచించారు.  అనంతరం స్పెషల్ డ్రైవ్ సీవరేజీ, ఇంకుడు గుంతల ప్రచార రథాలను మంత్రి జెండా ఊపి ప్రారంభించారు.

కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, నాంపల్లి ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్, జీహెచ్‌ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్ అనుదీప్, జలమండలి ఎండీ అశోక్‌రెడ్డి, ఈడీ మయాంక్ మిట్టల్, ఈఎన్‌సీ వీఎల్ ప్రవీణ్‌కుమార్, ఇంకుడు గుంతల ప్రత్యేకాధికారి జల సత్యనారాయణ, డైరెక్టర్లు సుదర్శన్, విజయ రావు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.