- రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి ప్రభుత్వం ప్లాన్
- పురపాలికలుగా మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల!
- ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సర్కారు
- గ్రామాలను విలీనం చేయొద్దంటూ కలెక్టర్‌కు వినతులు
- స్వాగతిస్తున్న అధికార పక్షం.. వ్యతిరేకిస్తున్న ప్రతిపక్షం
రంగారెడ్డి, డిసెంబర్ 4 (విజయక్రాంతి): పట్టణీయకరే లక్ష్యంగా ప్రభుత్వం రంగారెడ్డి జిల్లాలో మరో మూడు కొత్త మున్సిపాలిటీల ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తోంది. మున్సిపల్ ఏర్పాటుకు నివేదికలు అందజేయాలని డీపీవోలకు పురపాలక శాఖ నుంచి ఇటీవల ఉత్తర్వులు అందాయి.
ఇప్పటికే జిల్లాలో 13 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు ఉండగా మహేశ్వరం, కందుకూరు, చేవెళ్ల పంచాయతీలను మున్సిపాలిటీలుగా మార్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో ఆయా పంచాయతీల పరిధిలోకి వచ్చే మెజార్టీ గ్రామాలన్నీ మున్సిపాలిటీలో వీలినం కానున్నాయి. అయితే పంచాయతీ తీర్మానం లేకుండా తమ గ్రామాలను మున్సిపాలిటీల్లో ఎలా కలుపుతారంటూ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఈక్రమంలోనే తమ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయొద్దంటూ కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రాలు కూడా అందజేశారు. మున్సిపాలిటీల ఏర్పాటు అంశాన్ని అధికార పార్టీ స్వాగతిస్తుండగా ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విషయమై ఆయా పార్టీల నేతలు ప్రెస్‌మీట్‌లు పెడుతూ ఒకరిపై ఒకరు విమర్శల పర్వానికి తెరతీశారు.
పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పల్లెల్లో మౌలిక వసతులు కల్పించి పట్టణాలుగా మార్చేందుకు ప్రభుత్వం మున్సిపాలిటీల నిర్ణయం తీసుకున్నదని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. అధిక పన్నుల వడ్డింపు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా పంచాయతీలకు వచ్చే నిధులు ఆగిపోయి ప్రజలు ఉపాధిహామీ పనులకు దూరమై ఇబ్బందులు పడతారని..
రాజకీయ లబ్ధికోసమే కాంగ్రెస్ కొత్త ఎత్తుగడలు వేస్తోందని ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మహేశ్వరం కాంగ్రెస్ ఇంచార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి తమ అనుచరులతో సమావేశమవుతూ తమ ప్రాబల్యాన్ని చాటుకుంటున్నారు.
ఫోర్త్‌సిటీని దృష్టిలో పెట్టుకొని
మహేశ్వరం నియోజకవర్గంలోని కందుకూరు మండలం బేగరికంచెలో ప్రభుత్వం ఫోర్త్‌సిటీని నిర్మిస్తోంది. ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో అన్ని రకాల వసతులు, రవాణా వ్యవస్థ, విద్య, వైద్యం, స్పోర్ట్స్, పారిశ్రామిక హాబ్‌ల ఏర్పాటుకు పనులు చకచకా జరుగుతున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పర్యవేక్షణలో ఫోర్త్‌సిటీ నిర్మాణం కొనసాగుతు న్నది.
ఈ క్రమంలో ఫోర్త్ సిటీ సమీపంలోని మహేశ్వరం, కందుకూరు మండలాలను మున్సిపాలిటీలుగా మార్చి వాటి పరిధిలోని పల్లెల పట్టణీకరణకు ప్రభుత్వం సన్నాహాలు మొదలు పెట్టింది. ల్యాండ్ పూలింగ్ ద్వారా భూములు కోల్పోతున్న రైతులకు ఫోర్త్‌సిటీలో ఏర్పాటయ్యే కంపెనీల్లో ఉపాధి కల్పిం చేందుకు చర్యలు ప్రారంభించింది.
విలీనమయ్యే గ్రామాలు ఇవే
కందుకూరు మున్సిపాలిటీలో బేగరికంచె, అన్నోజిగూడ, రాచలూరు, తిమ్మాపూర్, గుమ్మడవెల్లి, కటికపల్లి, జైత్వారం, బైరాగిగూడ, నేదునూరు, దెబ్బడగూడ, ఆకులమైలారం, కొత్తగూడెం, కొత్తూరు, గూడురు వీలినం కాగా.. మహేశ్వరం మున్సిపాలిటీలో సిరిగిరిపురం, తుమ్మలూరు, ఉప్పుగడ్డ, కేసీతండాలు, గంగారం, మెహబత్‌నగర్, ఎండీ తండా, మన్సాన్‌పల్లి, గట్టుపల్లి, ఆకన్‌పల్లి, రాంచంద్రగూడ.. చేవెళ్ల మున్సిపాలిటీలో కందవాడ, పలుగుపట్ల, మల్లారెడ్డిగూడ, మల్కాపూర్, ఇబ్రహీంపల్లి, దేవునిఎర్రవెల్లి, దామరగిద్ద, రామన్నగూడ గ్రామ పంచాయతీలు విలీనం కానున్నాయి.
ఇప్పటికే ఆయా పంచాయతీలకు సంబంధించిన పూర్తి నివేదికలు పురపాలక శాఖకు చేరాయి. అయితే.. నూతన మున్సిపాలిటీల ఏర్పాటుపై ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ చేపడుతుందా? ఏకపక్ష నిర్ణయానికే జై కొడుతుందా? అని తెలుసుకునేందుకు వేచిచూడాల్సిందే.