అనధికారికంగా పనిచేయిస్తున్న కలెక్టర్ సీసీలు
నారయణపేట, సెప్టెంబర్14 (విజయక్రాంతి): నారాయణపేట జిల్లా పరిధిలో పనిచేస్తున్న కలెక్టర్ సీసీలు కిందిస్థాయి ఉద్యోగులను బానిసల్లా చూస్తున్నారు. వారు ఎప్పుడు ఎలాంటి హుకుం జారీ చేస్తారోనని నాలుగో తరగతి ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అనేకసార్లు ఊడిగానికి సంబంధించిన ఘటనలు బయటకు రాగా తాజాగా మరో ఘటన వెలుగు చూసింది. సీసీలు నారాయణపేట్ కలెక్టరేట్‌లో సాంఘిక సంక్షేమ వసతి గృహాలకు వంట కార్మికులతో పాచి పని చేయిస్తున్నారు. ఇదంతా అనధికారికంగా జరుగుతున్నదని వేరే చెప్పనక్కర్లేదు.
వంట కార్మికులు ప్రతిరోజూ 125 మంది విద్యార్థులకు మూడు పూటలా వండి పెట్టాల్సి ఉంటుంది. ఆ పనులు పూర్తి చేసి తర్వాత వసతి గృహంతో పాటు విద్యార్థులను పడక గదులను సైతం శుభ్రం చేయాలి. దీంతో వారిపై ఒత్తిడి కూడా అధికంగా ఉంటుంది. ఒకవిధంగా వీరిపై జాలి చూపాల్సి ఉందిపోయి కలెక్టరేట్ సీసీలు.. వారిని కలెక్టరేట్‌లో అనధికారికంగా పని చేయించడం గమనార్హం.
ప్రస్తుతం ఇద్దరు కార్మికులు కలెక్టరేట్‌లో పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై కలెక్టర్ వ్యక్తిగత సహాయకుడు బాల్‌రాజ్‌ను వివరణ కోరగా.. వంటి కార్మికులతో కలెక్టరేట్‌లో పనిచేయిస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదని, ఈ విషయాన్ని వెంటనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని సమాధా నమిచ్చారు.