calender_icon.png 27 October, 2024 | 9:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిల్లుల మంజూరులో పైరవీలకు ప్రాధాన్యం

13-09-2024 12:00:00 AM

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు పలువురు కాంట్రాక్టర్ల ఫిర్యాదు

హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబరు 12 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు పలు జోనల్ కార్యాలయాల లో పైరవీల తీరుపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా పలు అభివృ ద్ధి కార్యక్రమాలను నిర్వహించే కాంట్రాక్టర్లకు బిల్లుల మంజూరులో పైరవీలు సాగుతున్నాయని, ఈ కారణంగా ఏడాది కాలంగా బిల్లులు ఫైల్ చేసిన వారికంటే ముందు ప్రభుత్వంలోని ప్రముఖుల పేర్లతో వచ్చిన రిఫరెన్స్‌లను చూపిన వారికి అధికారులు బిల్లులు త్వరగా మంజూరు చేస్తున్నారంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలికి జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు.

జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6 జోన్లలో చేపట్టిన అభివృద్ధి పనులకు పలువురు కాంట్రాక్టర్లకు గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించాల్సి ఉంది. దాదాపు రూ. 1,150 కోట్ల నిధులు కాంట్రాక్టర్లకు మంజూరు కావాల్సి ఉంది. అయితే, ప్రస్తుతం బల్దియాలో నిధులు లేనందున ఏడాది కాలంగా జాప్యం జరుగుతోంది. వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా, కొందరు కాంట్రాక్టర్లు సీఎం రేవంత్ రెడ్డితో సహా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరుల పేర్లతో పైరవీలు చేయడం కారణంగా గతేడాది బిల్లులను వదిలేసి ఈ ఏడాది ఫైలింగ్ చేసిన బిల్లులను అధికారులు మంజూరు చేస్తున్నట్టు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన వారిలో కాంట్రాక్టర్లు సాయికిరణ్, భాస్కర్ రావు, శంకర్ రెడ్డి, కల్యాణ్, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.