calender_icon.png 4 October, 2024 | 6:42 AM

చెరువులపై గులాబీ రాబంధులు!

04-10-2024 12:00:00 AM

స్కిల్ టెస్ట్ లేకుండానే లీడర్లకు అక్రమ సభ్యత్వాలు

మత్స్యకార సొసైటీలో వెలుగులోకి మరిన్ని అక్రమాలు 

పెత్తనం చెలాయిస్తూ చేపలను మింగేస్తున్న దళారులు

నాగర్‌కర్నూల్, అక్టోబర్ 03 (విజయక్రాంతి): మత్స్యకారులకు జీవనాధా రంగా ఉన్న చెరువులపై గులాబీ లీడ ర్లు రాబంధుల్లా వాలి అందులోని చేపలను అమాంతం మింగేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో తమ పరపతిని ఉపయోగించి సొసైటీల్లోకి అక్రమంగా చొరబడి సభ్యత్వాలు పొందారు.

చేపలు పట్టడం, వల విసరడం, కనీసం ఈత రానివారు కూడా తామూ మత్స్యకారులమంటూ సొసైటీల్లో పేర్లు నమోదు చేసుకు న్నారు. అధికారులు సైతం స్కిల్ టెస్ట్ నిర్వహించకుండానే ముడుపులకు ఆశపడి ధనికులు, గులాబీ లీడర్లకు సొసైటీల్లో చోటు కల్పించారు. అనంతరం సొసైటీ ఎన్నికల్లో లక్షలు పోసి కుర్చీ దక్కించుకుని.. ఇప్పుడు దళారులతో కలిసిపోయి ఆ చెరువుల్లోని చేపలను ఆరగిస్తున్నారు.

ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారికి ఉపాధి లేకుండా చేస్తున్నారు. అయినా, అధికారులు తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని బాధిత మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మత్స్యకార సొసైటీల్లోని గులాబీ లీడర్లు చెరువులను అర్రాజ్ పాడి ఇతర ప్రాంతాలకు అమ్ముకోవడంతో చేపల ధరలు కూడా అమాంతం పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

స్థానికుల ఉపాధికి దెబ్బ

నాగర్‌కర్నూల్ జిల్లాలో 1,448 చెరువులకు గానూ 235 సొసైటీలను ప్రభుత్వం ఎన్నికల ద్వారా ఏర్పాటు చేసింది. కృష్ణా పరివాహక ప్రాంతాలైన సోమశిల, మంచాల కట్ట, దోమలపెంట, పాతాల గంగ వంటి ప్రాంతాల్లో 452 మార్కెటింగ్ సొసైటీలు ఉన్నాయి. కాగా, 18,225 మంది చేపలు పట్టేవారు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు.

ఇందులో యాబై శాతం మంది అనర్హులు అక్రమంగా సభ్యత్వం పొందినట్టు ఆరోపణ లు వినిపిస్తున్నాయి. మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తూ గత ప్రభుత్వం చెరువుల్లోకి చేపపిల్లలతోపాటు వాటిని పట్టుకుని ఇక్కడే అమ్ముకుని జీవనం సాగించాలన్న లక్ష్యంతో 4 వేలకు పైగా మోపెడ్‌లు, చేపలను బాక్సులో పెట్టి అమ్ముకోవడం కోసం 4 వేలకు పైగా ఐస్‌బాక్స్‌లను, 160 లగేజ్‌లు, 66కు పైగా వ్యాన్లు, ఐజినిక్ వెయికిల్స్, డ్రాగ్ నెట్‌లను 70 శాతం సబ్సిడీతో పంపిణీ చేసింది.

కానీ, వాటిని కూడా రాజకీయ పరపతి ఉన్న లీడర్లే అధికంగా పొంది, అనంతరం అమ్ముకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీంతో మత్స్యకారులపై దళారులు పెత్తనం చెలాయిస్తూ వారి ఉనికి ప్రశ్నార్దకం చేసే కుట్రలు కూడా జరుగుతున్నాయని స్థానిక మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మత్స్యకార్మికుడికి రోజుకు రూ.2౦

నాగర్‌కర్నూల్ కేసరిసముద్రం చెరువు సొసైటీ నేతలు మూడేళ్ల పాటు లీజుకు ఇచ్చేందుకు గత నెల అర్రాజ్ పాడారు. 340 మందికి సభ్యత్వాలు ఉండగా మూడేళ్లకు కోటి 3 లక్షలకు  పాడటంతో ఒక్కొక్కరికి రోజుకు రూ.20 చొప్పున భాగం వస్తుందని పంపకాలు జరిపారు.

వ్యతిరేకించిన వారిపై దాడు లకు తెగబడుతున్నారు. ఈ విషయాలతో ‘విజయక్రాంతి’లో ‘అర్రాజ్ పాడి అప్పజెప్తుండ్రు’ శీర్షికతో కథనాన్ని ప్రచురించగా.. జిల్లా మత్స్యశా ఖ అధికారి రజిని స్పందించారు. విచారించి చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం కొందరు లీడర్లు అంతా మా ఇష్టం అంటూ జిల్లా అధికారినే బెదిరించినట్టు తెలిసింది. 

తీరుమార్చుకోవాలని చెప్పాం 

అర్రాజ్ పాడిన విషయంలో స్థానికులకు అన్యాయం జరుగుతుందని తెలిసింది. వెంటనే అర్రాజ్ పాట ఎట్టిపరిస్థితిలోనూ చెల్లదని హెచ్చరించాం. వారం రోజులు గడువు ఇచ్చాం. ఇక్కడి వారే ఇక్కడే చేపలను పట్టుకుని జీవనం సాగించాలని చెప్పాం. ప్రభుత్వం చేపలను, వాహనాలను ఇతర సౌకర్యాలను కల్పించింది. వాటిని వినియోగించుకుని స్థానికులే ఉపాది పొందాల్సి ఉంది. 

రజిని, జిల్లా మత్స్యశాఖాఅధికారిని, నాగర్‌కర్నూల్