calender_icon.png 27 April, 2025 | 9:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘గులాబీ’ రజతోత్సవ జాతర

27-04-2025 01:05:55 AM

  1. నేడు బీఆర్‌ఎస్ 25ఏండ్ల సంబురం
  2. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో భారీ బహిరంగ సభ
  3. 10లక్షలకు పైగా జనసమీకరణ..అందుకుతగ్గ ఏర్పాట్లు
  4. 1,213 ఎకరాల్లో సభాప్రాంగణం, పార్కింగ్ ఏర్పాటు
  5. ట్రాఫిక్ ఆంక్షలు..వాహనాల దారిమళ్లింపు
  6.  కాలినడకన, ఎడ్లబండ్లలో సైతం తరలివస్తున్న శ్రేణులు 
  7. గులాబీ అధినేత కేసీఆర్ ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి
  8. సభకు భారీగా తరలిరండి: మాజీ మంత్రి హరీశ్‌రావు

కరీంనగర్/మహబూబాబాద్, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): తెలంగాణ స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా 2001, ఏప్రిల్ 27న పురుడుపోసు కున్న టీ(బీ)ఆర్‌ఎస్ ఆదివారం రజతోత్సవ సంబురం జరుపుకోనుంది. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో చరిత్రలో నిలిచిపోయేలా భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.

కరీంనగర్‌లో టీఆర్‌ఎస్ అవిర్భావం సందర్భంగా మే 17, 2001న నిర్వహించిన సింహగర్జన సభ ను మరిపించేలా గులాబీ రజతోత్సవ సభకు పదిలక్షలకు పైగా జనసమీకరణ చేశారు. 13 ఏండ్ల ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, 2014 నుంచి పదేండ్లపాటు అధికారం సాగించిన బీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్ర ఇంటిపార్టీగా ఖ్యాతి గాంచింది.

2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓట మి, ఆ తర్వాత లోక్‌సభ ఎన్నికల్లో ఘోర ప రాజయం తర్వాత..పార్టీలో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చేందుకు గులాబీ అధినేత కేసీఆర్..రజతోత్సవ సభను భారీగా నిర్వహిం చేందుకు సంకల్పించారు. ఆయన ఆదేశాల మేరకు గులాబీ పార్టీ 25 ఏండ్ల వేడుక బహిరంగసభకు భారీ ఏర్పాట్లు చేశారు. సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారు..అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

1,213 ఎకరాలు.. 500మంది కూర్చునేలా వేదిక

ఎల్కతుర్తిలోని 1,213ఎకరా ల్లో రజతోత్సవ మహాసభ నిర్వహించనున్నారు. 154 ఎకరాల్లో సభాప్రాంగణం సిద్ధమైంది. 500 మంది కూర్చునే సామర్థ్యంతో వేదిక గులాబీ రం గులతో తీర్చిదిద్దారు. వేదిక పక్క నే కళాకారుల ఆటాపాట కోసం ప్రత్యేకంగా మరో వేదిక ఏర్పాటుచేశారు.  

50వేల వాహనాలకు పార్కింగ్..

రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే దాదాపు 50 వేల వాహనాల కోసం 1,059ఎకరాల్లో పార్కిం గ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి. వీఐపీ వాహనాల కోసం సభావేదిక ఎడమభాగం, వెనుక భాగంలో పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటుచేశారు. మహాసభ ప్రాంగణంలో వాహనాలు, ప్రజలు వచ్చేందుకు వీలుగా గ్రీన్, రెడ్ కార్పెట్లు ఏర్పాటుచేశారు. కళ్లు జిగేల్‌మనేలా భారీ లైట్లను అమర్చారు. లైట్లు, ఎల్‌ఈడీ స్క్రీన్ల కోసం 200 భారీ జనరేటర్లు ఏర్పాటుచేశారు.

కేసీఆర్ అందరికీ స్పష్టంగా కనిపించేలా 20/50 సైజుతో కూడిన 23 ఎల్‌ఈడీ భారీ స్క్రీన్లు, భారీ సౌండ్ సిస్టమ్‌లను చుట్టుపక్కల ఏర్పాటుచేశారు. పది లక్షలకు పైగా జనాలు వస్తారని అంచనాతో 10 లక్షల వాటర్ బాటిళ్లు, 16 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, వివిధ రూట్లలో 6 అంబులెన్స్‌లు, పరిసరాల్లో 12 వైద్యశిబిరాలు, 1,200 తాత్కాలిక మరుగుదొడు సిద్ధం చేశారు.

ట్రాఫిక్ ఆంక్షలు..

------ ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ మహాసభ సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి వరకు మూడు ప్రధాన రూట్లలో వాహనాల దారిమళ్లింపు ఉంటుందన్నారు. వాహనదారులు, ప్రయాణికులు ఆయా మార్గాల్లోనే వెళ్లి పోలీసులకు సహకరించాలని ఏసీపీ కోరారు.

కరీంనగర్ నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు హుజూరాబాద్ నుంచి వయా పరకాల క్రాస్‌రోడ్డు, ఉప్పల్, కమలాపూర్, అం బాల, ముచ్చర్ల క్రాస్‌రోడ్, ఓఆర్‌ఆర్ ద్వారా రావాలి. హనుమకొండ నుంచి కరీంనగర్ వైపు వెళ్లే వాహనాలు ఇదేమార్గంలో ప్ర యాణించాలి. సిద్దిపేట నుంచి హనుమకొండకు వచ్చే వాహనాలు జనగామ మీదు గా ప్రయాణించాలి. ఇదే మార్గంలో సిద్దిపేటకు వెళ్లాలి. హుస్నాబాద్ నుంచి వచ్చే వాహనాలు వయా ముల్కనూరు, కొత్తకొండ, వేలేరు, మల్లికుదుర్ల, క్యాతంపల్లి, పెద్దపెండ్యాల ద్వారా హనుమకొండకు చేరుకోవాలి. ఇదే మార్గంలో హుస్నాబాద్ వైపు వెళ్లాలి.

జబ్బకు సంచితో గులాబీ జాతరకు..

‘జబ్బకు సంచి.. చేతిలో జెండా.. జాతర పోదామా.. ఓరుగల్లు గులాబీ జాతర పోదామా..’ అంటూ ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముఖరా కే గ్రామస్థులు ఎల్కతుర్తికి బయలుదేరారు. 27న జరిగే బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు ఒకరోజు ముందే ప్రయాణమయ్యారు. 

రజతోత్సవానికి తరలిరండి

మాజీ మంత్రి హరీశ్‌రావు ఆహ్వానం

హనుమకొండ, ఏప్రిల్ 26 (విజయక్రాంతి): హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో నేడు నిర్వహించనున్న బీఆర్‌ఎస్ రజతోత్సవ సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలిరావాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పిలుపునిచ్చారు. శనివారం హనుమకొండలో మీడియాతో ఆయన మాట్లాడరు.

సభకు రైతులు, యువత పెద్దఎత్తున కదిలి వస్తున్నారని చెప్పారు. అంతేకాకుండా స్వచ్ఛందంగా అనేకమంది ప్రజలు తమ అంచనాలకు మించి వస్తారని పేర్కొన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మాటలు వినేందుకు రాష్ట్ర ప్రజలందరూ ఎదురుచూస్తున్నారని, అందుకోసమే సభకు స్వచ్ఛందంగా వస్తున్నారని హరీశ్‌రావు అన్నారు. దీంతో కాంగ్రెస్‌కు టెన్షన్ పట్టుకున్నదన్నారు.

కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా రాష్ట్రంలో వచ్చేంది బీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని, ప్రజల ఆకాంక్షను నిజం చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు కూడా మళ్లీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారని చెప్పారు. అందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమకారులు, తెలంగాణ వాదులు, యువత, రైతులందరూ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ట్రాఫిక్ సమస్య రాకుండా పార్టీ కార్యకర్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.