27-03-2025 05:49:25 PM
కాటారం/భూపాలపల్లి (విజయక్రాంతి): నాయి బ్రాహ్మణుల వృత్తిని నిర్వీర్యం చేస్తున్న పింక్ అండ్ బ్లూ కార్పొరేట్ సంస్థ వైఖరికి నిరసనగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆరవ రోజుకు చేరాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో పింక్ అండ్ బ్లూ కార్పొరేట్ సంస్థ ఆధ్వర్యంలో సెలూన్ షాపులను నిర్వహించడాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ నాయి బ్రాహ్మణ వృత్తి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు గురువారం భూపాలపల్లి జిల్లా తీన్మార్ మల్లన్న టీం అధ్యక్షులు రవి పటేల్ మద్దతు పలికారు.
రిలే దీక్ష శిబిరం వద్ద ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రవి పటేల్ మాట్లాడుతూ... బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయి బ్రాహ్మణుల వృత్తిని కనుమరుగు చేయడానికి కార్పొరేట్ సంస్థలు పింక్ అండ్ బ్లూ లాంటివి పుట్టుకు రావడం దురదృష్టకరమని అన్నారు. జిల్లా కేంద్రంలో పింక్ అండ్ బ్లూ సంస్థకు ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అనాదికాలం నుంచి నాయి బ్రాహ్మణులు అందిస్తున్న సేవలు, అనిర్వచనీయమైనవని ఆయన అన్నారు.
సెలూన్ షాపులు ఏర్పాటు చేసుకుని పొట్టకూటి కోసం నాయి బ్రాహ్మణులు కడుపేదరికంతో జీవిస్తున్నారని, వారికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు. ఈ మేరకు పింక్ అండ్ బ్లూ సంస్థకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు, భూపాలపల్లి ఎమ్మెల్యేకు, మున్సిపల్ కమిషనర్లకు నాయి బ్రాహ్మణులు వినతి పత్రాలు అందజేశారు. నాయి బ్రాహ్మణుల సంక్షేమానికి విఘాతం కలిగించే చర్యలను విరమించుకోవాలని, లేనియెడల ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు విజ్జగిరి సమ్మయ్య హెచ్చరించారు.