మణుగూరు/బూర్గంపాడు,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంజనాపురం గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన మానవత్వాన్ని చాటుకున్నారు. టాటా మ్యాజిక్ వాహనం, బైక్ లు డీ కొన్న సంఘటనలో బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో అదే మార్గంలో ప్రయాణిస్తున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు ఘటనను గమనించి వెంటనే తన కారులో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రికి చేరుకునే వరకు ఆందోళన చెందవద్దని చెబుతూ గాయపడినవారిని ఎమ్మెల్యే క్షతగాత్రులను ఓదార్చారు. ఆసుపత్రికి చేరిన వెంటనే డాక్టర్‌కి ఫోన్ చేసి వారికి అత్యుత్తమ వైద్యం అందించాలంటూ ఆదేశాలు ఇచ్చారు. ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించడంలో ఎమ్మెల్యే చూపిన అప్రమత్తత, సేవాభావం అందరి మన్ననలు పొందుతోంది. ప్రజా ప్రతినిధిగా మాత్రమే కాకుండా, ఒక బాధ్యతాయుతమైన మానవతావాది అని మరోసారి నిరూపించుకున్నారు అంటూ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు పలువురు అభినందనలు తెలిపారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.