కేసులో ట్విస్ట్
బాయ్‌ఫ్రెండే హత్య చేశాడని కుటుంబ సభ్యుల ఆరోపణ
శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపెట్టినట్టు ఫిర్యాదు
ముంబై, నవంబర్ 28: ఎయిర్ ఇండియా పైలట్ సృష్టి తులి(25)ని ఆమె బాయ్‌ఫ్రెండ్ ఆదిత్య పండిట్ (27) శారీరకంగా, మానసికంగా వేధించినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. సృష్టి ఓ పార్టీలో మాంసాహారం తింటే ఆదిత్య ఆమె ను అందరిముందు దుర్భాషలాడినట్లు పోలీసులకు కుటుంబ సభ్యు లు తెలిపారు. అంతేకాకుండా పలుమార్లు మార్గమధ్యలోనే కారు దింపేసి క్రూరంగా ప్రవర్తించేవాడని చెప్పారు. డబ్బు విషయంలో కూడా సృష్టిని ఆదిత్య వేధించేవాడనీ, అతడికి మరో అమ్మాయితో ఎఫైర్ ఉన్నట్టు అనుమానం వ్యక్తం చేశారు.
చనిపోవడానికి 15 నిమిషాల ముందు సృష్టి తమతో ఎంతో ఉల్లాసంగా మాట్లాడినట్టు వెల్లడించారు. సృష్టిని ఆదిత్య హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆదిత్యతో ఎఫైర్ పెట్టుకున్న యువతికి కూడా ఈ కేసుతో సంబంధం ఉందనీ, అమె పాత్రపై కూడా విచారణ జరపాలని కోరారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తు తం ఆదిత్య పోలీసు అదుపులో ఉన్నారు. ఇదిలా ఉంటే న్యాయం కోసం సృష్టి కుటుంబ సభ్యులు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను కలిసేందుకు సిద్ధం అయ్యారు.
ఎవరీ సృష్టి తులి?
ఉత్తరప్రదేశ్ గోరఖ్‌పూర్‌కు చెంది న సృష్టి పైలట్ శిక్షణ కోసం రెండేళ్ల క్రితం ఢిల్లీకికి వచ్చింది. కమర్షియల్ పైలెట్‌గా శిక్షణ తీసుకుంటున్న సమయంలో ఆమెకు ఆదిత్య పరిచయం అయ్యాడు. వారిద్దరి మధ్య స్నేహం కుదిరి చివరికి ప్రేమగా మారింది. సృష్టి విజయవంతంగా పైలట్ శిక్షణను పూర్తి చేసుకుని ఎయిర్ ఇండి యాలో ఉద్యోగం సాధించింది. దీంతో చిన్న వయసులో పైలట్ అయిన సృష్టిని సీఎం యోగి ఆదిత్యనాథ్ అభినందించారు. సృష్టి బాయ్ ఫ్రెండ్ ఆదిత్య మాత్రం మధ్యలోనే శిక్షణను వదిలేశాడు. వీరిద్దరూ ముంబైలో ఓ ఫ్లాట్‌లో ఉంటున్నా రు. ఈ క్రమంలోనే గత సోమవా రం సృష్టి తన ఫ్లాట్‌లో అనుమానస్పద రీతిలో మరణించింది.