calender_icon.png 20 January, 2025 | 6:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జగజ్జేతల జైత్రయాత్ర

05-07-2024 01:01:24 AM

పన్నెండేళ్లకోసారి వచ్చే పుష్కరాల్లో పుణ్యస్నానం చేసేందుకు వచ్చిన భక్తుల్లా.. 

సమ్మక్క సారక్క గద్దె నెక్కుతుంటే తిలకించేందుకు తరలివచ్చిన గిరిజనుల్లా..

యావత్ భారతమంతా ఒక్క చోట చేరిందా అని అనుమానమొచ్చేలా..

ప్రపంచకప్ ట్రోఫీ కోసం 13 ఏళ్లుగా సాగుతున్న నిరీక్షణకు ఫుల్‌స్టాప్ పెడుతూ.. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయఢంకా మోగించిన రోహిత్ సేనకు స్వాగతం పలికేందుకు ఎడతెరిపిలేని వర్షంలో కూడా అభిమానులు గంటల తరబడి నిరీక్షించారు. ముంబైలోని నారిమన్ పాయింట్ నుంచి వాంఖడే స్టేడియం వరకు జనసంద్రంలో గంటన్నర పాటు సాగిన విజయయాత్రలో ఎన్నెన్ని చిత్రాలో.. ఉబికివస్తున్న కన్నీటిని ఆపుకుంటూ టీమిండియా విజయరథం ముందుకు కదులుతుంటే.. ఆనంద భాష్పాలు రాల్చని అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు! క్రికెట్‌ను మతంగా కొలిచే దేశంలో.. అతిపెద్ద పండగ తీసుకొచ్చిన రోహిత్ సేనకు.. యావత్ భారతావని సెల్యూట్ కొట్టింది!!

చక్‌దే ఇండియా! టీ20 చాంపియన్స్‌కు గ్రాండ్ వెల్‌కమ్

సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలిచి స్వదేశానికి చేరుకున్న భారత క్రికెట్ జట్టుకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు. కరీబియన్ దీవుల నుంచి కప్పుతో తిరిగి వచ్చిన టీమిండియాకు ఇటు ఢిల్లీలో.. అటు ముంబైలో ఘనస్వాగతం లభించింది. ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయిన రోహిత్ సేన.. సాయంత్రం ముంబైలో నిర్వహించిన విన్నింగ్ పరేడ్‌లో పాల్గొంది. 

న్యూఢిల్లీ/ముంబై: సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ ప్రపంచకప్ ట్రోఫీ చేజిక్కిం చుకున్న టీమిండియాకు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. ఎయిర్‌పోర్టు నుంచి ఆటగాళ్లు నేరుగా ఐటీసీ మౌర్య హోటల్‌కు చేరుకున్నారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీని కలిసేందుకు ఉదయం 11 గంటల ప్రాంతంలో లోక్ కల్యాణ్ మార్గ్‌లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా మోదీ భారత ఆటగాళ్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ రెండోసారి పొట్టి ప్రపంచకప్ సాధించిన టీమిండియాకు మోదీ ప్రత్యేక అభినందనలు తెలిపారు.

కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారని ప్రశంసల జల్లు కురిపించారు. జట్టు విజేతగా నిలవడంలో ప్రతీ ఆటగాడు కీలకపాత్ర పోషించాడని కొనియాడారు. అనంతరం ఆటగాళ్లతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోదీ ప్రత్యేక చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ సహా ఇతర ఆటగాళ్లు తమ అనుభవాలను మోదీతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత క్రికెటర్లతో పాటు బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా హాజరయ్యారు. ఈ సందర్భంగా జై షా, రోజర్ బిన్నీ ప్రధాని మోదీకి ‘నమో’ అని రాసి ఉన్న 1వ నంబర్ జెర్సీని గిఫ్ట్‌గా అందించారు. ప్రధానితో ఆటగాళ్ల భేటీకి సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ వేదికగా పంచుకుంది.

‘భారత ప్రధాని మోదీ ప్రపంచకప్ విజేతలుగా నిలిచిన టీమిండియా ఆటగాళ్లను కలిశారు. మీ స్పూర్తివంతమైన వ్యాఖ్యలను ఆచరణలోకి తీసుకొస్తాం’ అని పోస్టు చేసింది. ఈ సందర్భంగా ఆటగాళ్ల కుటుంబ సభ్యులతోనూ మోదీ సరదాగా గడిపారు. మ్యాన్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఏస్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా కుమారుడిని ఎత్తుకున్న మోదీ.. ఇతర ప్లేయర్ల బంధువుల తోనూ ముచ్చటించారు. కాగా మోదీతో భేటీ అనంతరం టీమిండియా ఆటగాళ్లు తమ సోషల్ మీడియా పేజీల్లో ప్రధానితో ప్రత్యేక అనుభవాలను పంచుకున్నారు.

అడుగడుగునా బ్రహ్మరథం..

జగజ్జేతలుగా అవతరించిన టీమిండియా కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన అభిమానులతో ముంబై తీరం జనసంద్రంగా మారింది. తమ అభిమాన ఆటగాళ్లను కళ్లారా చేసేందుకు ఇసుక వేస్తే రాలనంతగా అభిమానులు పోటెత్తారు. అడుగు తీసి అడుగు వేయడానికే కష్టంగా మారింది. ఒకపక్క వర్షం కురుస్తున్నా లెక్క చేయ ని అభిమాన గణం ఆటగాళ్లను తమ ప్రేమ వర్షంలో తడిసి ముద్దయ్యేలా చేశారు. ప్రధాని మోదీతో భేటీ అనంతరం సాయం త్రం ముం బైకి చేరుకున్న రోహిత్ సేన బీసీసీఐ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపె న్ టాప్ బస్సులో నారీమన్ పాయింట్ నుంచి ప్రఖ్యాత వాంఖడే స్టేడియానికి రోడ్ షో తో బయల్దేరింది.

ఈ నేపథ్యంలో అడుగడుగునా అభిమాను లు ఆటగాళ్లకు నీరాజనాలు పట్టారు. సుమారు గంటన్నరపాటు సాగిన రోడ్ షోలో ఆటగాళ్లు వరల్డ్‌కప్ ట్రోఫీ పట్టుకొని అభి మాను లను ఉత్సాహపరిచారు. అభిమానుల కోరిక మేరకు రోడ్ షో మధ్య లో కెప్టెన్ రోహిత్, కోహ్లీలు కలిసి వరల్డ్‌కప్‌తో అభివాదం చేయగా.. ఆ సమయంలో రోహిత్, కోహ్లీ నినాదాల తో మెరైన్ రోడ్డు మార్మోగిపోయింది. రాత్రి 9 గంటల ప్రాం తంలో రోడ్డు షో ముగియగా లక్షలాది అభి మానుల సమక్షంలో టీమిండియా వాంఖడే స్టేడియంలో అడుగుపెట్టింది. అనంతరం బీసీసీ ఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, కోచ్ రాహుల్ ద్రవిడ్ తమ ఆనందాన్ని పంచుకున్నారు. చివరగా ప్రపంచకప్ విజేతలకు బీసీసీఐ రూ.125 కోట్ల చెక్కు బహుకరించింది. 

రోహిత్ మట్టి రుచి ఎలా ఉంది?

పొట్టి ప్రపంచకప్ గెలిచి స్వదేశంలో అడుగుపెట్టిన టీమిండియా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా భేటీ అయింది. ఈ సందర్భంగా ఆటగాళ్లను అప్యాయంగా పలకరించిన మోదీ టూర్ విశేషాలను అడిగి తెలుసుకున్నారు. సరదా ప్రశ్నలు వేసి నవ్వులు పూయించారు. ఫైనల్ గెలిచిన అనంతరం రోహిత్ బార్బడోస్ పిచ్‌పై మట్టిని తిన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని.. ‘మట్టి రుచి ఎలా ఉంది రోహిత్?’ అని ప్రశ్నించారు.

దీనికి రోహిత్ నవ్వుతూ.. ‘బాగుంది.. ఆ క్షణంలో అలా జరిగిపోయింది’ అని సమాధానమిచ్చాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్‌తో మెరవడం ఎలా అనిపించిందని కోహ్లీకి ప్రశ్న సంధించారు. క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చి మంచి స్కోరు చేయడం ఎలా అనిపించిందని అక్షర్ పటేల్‌ను అడిగారు. ఆఖరి ఓవర్‌లో దక్షిణాఫ్రికా 16 పరుగులు చేయాల్సిన తరుణంలో ఒత్తిడిని ఎలా తట్టుకున్నావ్ అని పాండ్యాకు ప్రశ్న వేశారు. మోదీ వేసిన ప్రశ్నలకు ఆటగాళ్లు ఉత్సాహంగా సమాధానాలిచ్చారు.