calender_icon.png 21 October, 2024 | 4:16 PM

రోడ్డుపైనే ధాన్యం రాశులు

16-10-2024 01:01:56 AM

ప్రమాదాలకు కారణాలు

పోలీసు కేసులవుతున్నా మారని వైనం

సిరిసిల్ల, అక్టోబర్ 15: రహదారిపై ధాన్యం కుప్పలు ఆరబోయడంతో రోడ్డు ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతున్నాయి. ఏటా ఇలా జరుగుతున్నా రైతుల్లో మార్పు రావడం లేదు. పోలీసులు ధాన్యం రాశులు రోడ్లపై పోయవద్దని ఆదేశాలు చేస్తున్నా, కేసులు నమోదు చేస్తున్నా రైతులు పట్టించుకోవడం లేదు.

రైతులకు సరైన సదుపాయాలు లేక రోడ్లపైనే ధాన్యం పోసి ఆరబెడుతున్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణం చంద్రంపేట గ్రామానికి చెందిన వేముల రాజశేఖర్ అనే యువకుడు బైక్‌పై పెద్దూరు నుంచి చంద్రంపేటకు వస్తున్న క్రమంలో పెద్దబోనాల బోనాల గ్రామాల సమీపంలో ధాన్యం రాశులను ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి ప్రాణపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.

కోమాలోకి వెళ్లిన యువకుడి చికిత్సకు రూ.30 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. గతేడాది కోనరావుపేట మండలం నిమ్మపల్లికి చెందిన వ్యక్తి సిరికొండ మండలానికి వెళ్తుండగా మరిమడ్ల గ్రామశివారులో ధాన్యం కుప్పలకు బైక్ ఢీకొనడంతో మృతిచెందాడు.

గ్రామీణ ప్రాంతాల్లో వసతులతో కూడిన కల్లాలు లేకపోవడంతో రైతులు వరి ధాన్యం రోడ్లపై ఆరబెట్టుకుంటున్నారు. పొలాల వద్ద నేల పచ్చిగా ఉండటం, అక్కడి నుంచి ధాన్యం తరలించేందుకు ఇబ్బందులు తలెత్తడంటంతో రోడ్లపైకి వస్తున్నారు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.