మున్సిపాలిటీ అప్పుల్లో తెలంగాణ టాప్-2
- బీఆర్‌ఎస్ హయాంలో ఇబ్బడిముబ్బడిగా రుణాలు
- రాష్ట్ర పురపాలికల తలసరి ఆదాయంలో అప్పుల వాటా 15.1%
- రాబడిలో పర్యాలేదు.. పెరిగిన సొంత పన్నుల ఆదాయం
- 2023-24 నివేదికలో ఆర్బీఐ వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 14 (విజయక్రాంతి): తెలంగాణలోని మున్సిపాలి టీలు అప్పుల్లో కూరుపోయాయి. దేశం లో మున్సిపాలిటీలకు ఎక్కువ అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్-2లో నిలిచింది. మొదటి స్థానంలో ఒడిశా ఉంది. గత బీఆర్‌ఎస్ సర్కారు ఇబ్బడి ముబ్బడి అప్పులు చేసినట్లు ఆర్బీఐ నివేదిక స్పష్టం చేసింది.
రాష్ట్ర పురపాలికల తలసరి ఆదాయంలో అప్పుల వాటా 14.4శాతంగా ఉన్నట్లు తెలిపింది. దేశంలోని మున్సిపాలిటీల ఆర్థిక స్థితిపై తాజా గా ఆర్బీఐ నివేదికను విడుదల చేసింది. 2022లో మొదటిసారిగా మున్సిపాలిటీ ఫైనాన్స్ అవకాశాలు, సవాళ్లపై నివేదికను రూపొందించిన సెంట్రల్ బ్యాంకు.. ఇప్పుడు రెండో నివేదికను విడుదల చేసింది.
దేశంలోని 232 పురపాలికలకు సంబంధించి 2019-20 నుంచి 2023-24 వరకు ఉన్న ఆదాయం, ఖర్చు, రుణాలు, మార్కెట్ బాండ్లు.. ఇలా అనేక అంశాలపై వివరణాత్మ నివేదికను విడుదల చేసింది. ఇందులో 2023-24 ఏడాదికి సంబంధించి బడ్జెట్ అంచనాల్లో వచ్చిన రాబడి ఆధారంగా ఈ నివేదికను ఆర్బీఐ తయారుచేసింది.
దేశ మున్సిపాలిటీ తలసరి ఆదాయం రూ.11,532 కాగా.. ఇందులో తెలంగాణ పురపాలికల అప్పుల వాటా 14.4 శాతంగా చెప్పింది. ఒడిశా వాటా 15.1 శాతంగా వెల్లడించింది.
సొంత పన్నుల రాబడిలో దక్షిణాది రాష్ట్రాలు భేష్
సొంత పన్నుల రాబడిలో దక్షిణాది రాష్ట్రాల పనితీరు బాగున్నట్లు ఆర్‌బీఐ చెప్పింది. అదే విధంగా తెలంగాణలో సొంత పన్నుల రాబడులు భారీగా పెరిగినట్లు చెప్పింది. పురపాలిలకు వచ్చే ప్రతి రూ.లక్ష రాబడిలో సొంత పన్నులు వాటా ౫౦ శాతంగా ఉందని అభిప్రాయపడింది. సొంతపన్నులు ఎక్కువ వస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ టాప్-2లో నిలిచినట్లు ఆర్బీఐ చెప్పింది.
అదేవిధంగా దేశంలోని మున్సిపాలిటీల ఆదాయ వనరులు మెరుగుపడాల్సి ఉందని అభిప్రా యపడింది. అర్బన్ స్థానిక సంస్థలకు ఆదాయం వస్తున్నా ఇంకా కేంద్ర గ్రాంట్లపైనే ఆధారపడాల్సి వస్తోంది చెప్పింది. ఇప్పుడు ఆదాయ వనరులు పెరుగుతు న్నా జనాభా అవసరాలను తీర్చడానికి సరిపోవని, ఇంకా మెరుగుపడాల్సిన అవసరం ఉందని వెల్లడించింది.
* 2020-21 నుంచి 2022-23 మధ్య ప్రాపర్టీ ట్యాక్స్ బడ్జెట్ అంచనాల్లో 50శాతం మాత్రమే వసూలైంది.
* సొంత ఆదాయ వనరుల్లో నీటి పన్ను వాటా రాష్ట్రంలో 2.91 శాతమే ఆర్బీఐ చెప్పింది.
* తెలంగాణ మున్సిపాలిటీల రెవెన్యూ 2022-23లో రూ.4,573.42 కోట్లు కాగా.. 2023-24లో రూ.4762.31కోట్లుగా ఆర్బీఐ చెప్పింది.
* రాష్ట్రంలోని మున్సిపాలిటీల సొంత పన్నుల రాబడి 2022-23లో రూ.2,237.43 కోట్లు కాగా.. 2023-24లో రూ.2,395.52కోట్లు.
* 2020-22 మధ్య కరోనా కారణంగా దేశంలో మున్సిపాలిటీల బాండ్ యాక్టివిటీ తగ్గిపోయిందని, 2023-24లో భారీగా పెరిగిందని ఆర్బీఐ వెల్లడించింది.
* దేశంలోని మున్సిపాలిటీలకు కేంద్ర గ్రాంట్లు 2022తో పోలిస్తే 2023లో 24.9శాతం పెరిగాయి. రూ.7,067కోట్లు ఫైనాన్స్ కమిషన్ నిధులు కాగా.. రూ.7,664 ఇతర నిధులు
తెలంగాణ రాష్ట్ర రాబడిలో మున్సిపాలిటీల వాటా (శాతంలో)
ఏడాది శాతం జాతీయ సగటు
2022 2.6 3.6
2023 2.2 4.0
మున్సిపాలిటీలకు వచ్చిన రాబడిలోని ప్రతి రూ.లక్షలో పన్నుల వాటా
రాష్ట్రం 2022-23 2023-24
కర్ణాటక 0.73 0.54
తెలంగాణ 0.49 0.50
తమిళనాడు 0.46 0.44
జార్ఖండ్ 0.23 0.44
గోవా 0.48 0.42
ఆంధ్రప్రదేశ్ 0.44 0.38
గుజరాత్ 0.38 0.36
పంజాబ్ 0.40 0.35
హిమాచల్ ప్రదేశ్ 0.32 0.34
మధ్యప్రదేశ్ 0.27 0.32
ఛత్తీస్‌గఢ్ 0.28 0.30