విజయవాడ, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): విజయవాడ వరద బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందంటూ ఒంగోలుకు చెందిన విశ్రాంత జర్నలిస్ట్ నాతాని భూపతిరావు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. వరద నివారణ, వరదలను ఎదుర్కోవడం, బాధితుల పునరావాసం, ఆహార సరఫరా వంటి పనుల్లో ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని వాదించారు. బుడమేరు నుంచి నీటి విడుదల సమయంలో ప్రజలను అప్రమత్తం చేయలేదని తెలిపారు.
బుడమేరుతోపాటు కృష్ణా నదిని ఆనుకుని జరిగిన ఆక్రమణల తొలగింపునకు ఉత్తర్వులు ఇవ్వాలని, నిర్లక్ష్యానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిల్‌లో కోరారు. ఇందులో ప్రతివాదులుగా కేంద్ర హోం, ఎర్త్ సైస్సెస్, అటవీ, పర్యావరణ శాఖల కార్యదర్శులను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి, జల వనరుల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ను చేర్చారు. సీఎం చంద్రబాబును వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారు.