calender_icon.png 30 September, 2024 | 11:02 PM

సివిల్ సప్లయిస్ కార్పొరేషన్లో అవినీతిపై పిల్

05-09-2024 01:43:00 AM

హైకోర్టును ఆశ్రయించిన బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి 

హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీజీ సీఎస్సీఎల్)లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని హైకోర్టులో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆ సంస్థ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రభుత్వ ఖజానాకు దాదాపు రూ.1100 కోట్ల మేర నష్టం కలిగించేలా అక్రమాలు జరుగుతున్నాయని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇష్టానుసారంగా నిబంధనలను ఉల్లంఘించి అక్రమా లకు తెర తీశారని ఆరోపించారు.

ప్రభుత్వం వద్ద ఉన్న వడ్లనే మిల్లర్ల వద్ద బియ్యంగా పట్టిస్తే సరిపోయేదని, తక్కువ ధరకు వడ్లను బిడ్డర్లకు విక్రయించడం, తిరిగి అత్యధిక ధరకు అదే బిడ్డర్ల నుంచి బియ్యం కొనుగోలు చేయడం ద్వారా పెద్ద మొత్తంలో అవినీతి జరుగుతోందని ఆరోపించారు. మెట్రిక్ టన్నుకు రూ.32,799 మేర ప్రభుత్వానికి నష్టం జరుగుతోందని, ఈ వ్యవహార ంపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, కార్పొరేషన్‌కు విజ్ఞప్తులు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టుకు రావాల్సి వచ్చిందని చెప్పారు.

ఈ అక్రమాలను కట్టడి చేస్తూ తుది ఉత్తర్వులు ఇవ్వాలని, ఈలోగా ఆ ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలు చేసిన పిల్‌లో ప్రతివాదులుగా పౌరసరఫరాలశాఖ ముఖ్యకార్యదర్శి, కార్పొరేషన్ వైస్ చైర్మన్, ఎండీ, కమిషనర్ ఇతరులను చేర్చారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేయనుంది. మార్కెట్ ధరను పట్టించుకోకుండా తక్కువ ధరకు టెండర్లు పిలవడంతో ఇప్పటివరకు జరిగిన పాతిక శాతం అమ్మకాల్లోనే దాదాపు రూ.౧౮౮ కోట్ల మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇది ఇలానే కొనసాగితే నష్టం రూ.౭౫౦ కోట్లకు చేరుతుందని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రభుత్వ ఖజానాకు నష్టం పెరగకుండా తక్షణమే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. సన్నరకం వడ్లు మెట్రిక్ టన్నుకు రూ.24,071 చొప్పున విక్రయానికి టెండర్లు పిలిచిందని, కొద్ది రోజులకే సన్నరకం బియ్యం మెట్రిక్ టన్నుకు రూ.56,799 చొప్పున కొనుగోలు చేసేందుకు ప్రొక్యూర్మెంట్ టెండర్ పిలిచిందన్నారు. ఒకే అధికారి రెండు టెండర్లను పిలవడం వల్ల బిడ్డర్లకు మేలు జరుగుతోందని ఆరోపించారు. ఈ బాగోతం వెనుక సంస్థ అధికారు లు, ప్రభుత్వ పెద్దలు ఉన్నారు.

నలుగురు బిడ్డర్లలో ముగ్గురు బిడ్డర్లు కార్పొరేషన్ జారీచేసిన ప్యాడీ అమ్మకం, బియ్యం కొనుగోళ్లు రెండు టెండర్లను వశం చేసుకున్నారు. ఇది వరకు మిల్లర్లు బియ్యం ఇవ్వలేకపోతే గన్నీ బ్యాగులు, రవాణా, వడ్డీ సహా ప్రభుత్వానికి అయిన ఇతర ఖర్చులు కలిపి నిర్ణీత మొత్తా న్ని నేరుగా ప్రభుత్వానికి చెల్లింపులు చేసే వీలుండేంది. థర్డ్ పార్టీ బిడ్డర్ల ప్రమేయం లేకుండా ఉండేది. ప్రభుత్వానికి నష్టం లేకుండా ప్రక్రియ కొనసాగేంది. ఇప్పుడు బిడ్డర్లకు మేలు చేకూరేలా ప్రభుత్వానికి నష్టం చేకూరేలా ఉన్న చర్యలను అడ్డుకోవాలని పిల్లో పేర్కొన్నారు.