-గన్నమరాజు గిరిజా మనోహరబాబు
9949013448
“అది వేదాగమసార సంగ్రహము సత్యజ్ఞాన సంపాదనం
బది రుద్రాది మహాపురాతన కథావ్యాప్తంబు పాపావహం
బది సద్భక్తి వివృద్ధి కారణము ముక్త్యావాస మట్లౌను నీ
వన చెప్పందగు బద్యకావ్యముగ కావ్యప్రజ్ఞ సేవ్యంబుగన్”
అంటూ పాల్కురికి సోమనాథుని ‘బసవ పురాణపు’ ఔన్నత్యాన్ని ఈ పద్యం అభివర్ణించింది. ఇది పిడుపర్తి సోమనాథుడు రచించిన ‘పద్య బసవ పురాణం’ లోనిది. పాల్కురికి ద్విపద కావ్యమైన ‘బసవ పురాణాన్ని’ పద్యకావ్యంగా చంపూ పద్ధతిలో రాయమని తన తండ్రి అయిన పిడుపర్తి మొదటి బసవన స్వయంగా పిడుపర్తి సోమనాథునికి ఆదేశించాడు. ఈ విషయాన్ని గ్రంథం ‘అవతారిక’లో పిడుపర్తి సోమనే చెప్పుకున్నాడు. “తండ్రి కోరికను పిత్రాజ్ఞగా భావించి తాము నిత్యం ఆరాధించుకునే బసవేశ్వరుని చరిత్రను, పాల్కురికి రచించిన కావ్యాన్ని పద్యరూపంలోకి మారుస్తూ, ఈ మహాగ్రంథాన్ని రచించినట్లు” పేర్కొన్నాడు.
అంతేకాదు, ఆయన ఈ కావ్యాన్ని మూల గ్రంథకర్త అయిన పాల్కురికి సోమనాథునికే అంకితం ఇవ్వడం మరో విశేషం. అదికూడా తండ్రి ఆదేశాన్ని పాటించి చేసిన సత్కార్యమే.
‘బసవ పురాణాని’కి పద్యరూపం
శైవ సంప్రదాయ నిష్ఠాగరిష్ఠులైన పిడుపర్తి కవులలో శిఖరాయమాన కవిగా సుప్రసిద్ధుడైన వాడు పిడుపర్తి సోమనాథుడు. ఆయనకు పాల్కురికి సోమన కృతి ‘బసవ పురాణం’ వేద సమాన గ్రంథం కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. పైగా, తండ్రి ఆదేశం ఈ రచనకు శ్రీకారం చుట్టించింది. పిడువర్తి మొదటి బసవన కూడా సామాన్యుడేమీ కాదు. శ్రీనాథునివలె చిన్ననాటి నుంచే రచనలు చేసిన మహాకవి. ‘గురుదీక్షా బోధ’, ‘పిల్లనైనారు కథ’, ‘బ్రహ్మోత్తర ఖండం’ వంటి ప్రశస్తి పొందిన రచనలు చేసిన పండిత కవికూడా.
గొప్ప శివభక్తి దీక్షాదక్షుడు. పాల్కురికి సోమనపట్ల అఖండమైన గౌరవ ప్రపత్తులు కలిగిన వాడు. కనుకే, ‘తమకు ప్రమాణ గ్రంథం పాల్కురికి సోమన కృతి బసవ పురాణమే’ అన్న ప్రగాఢ విశ్వాసంతోనే తన కుమారునికి ఆ గ్రంథాన్నే పద్యకావ్యంగా రాసి, పాల్కురికి సోమనాథునికే అంకితమివ్వ వలసిం దిగా ఆదేశించాడు. తండ్రి మాటను జవదాటని తత్తం కలిగిన పిడుపర్తి సోమన ఆ మేరకు చంపూ కావ్యపద్ధతిలో ‘పద్య బసవ పురాణాన్ని’ రచించి పాల్కురికి సోమనాథునికి అంకితం చేశాడు.
అందుకే తన కావ్యంలో
“సోముడేమి చెప్పె, సోమేశు ద్విపదలే
పెట్టి పద్యములుగ బెనిచెనంచు
నన్యుల నగ వలదు నాయయ్య శిష్యుల
మగుట మనకు జెల్లు నవియు నిలువ”
అంటూ తను చేసిన పనిని సమర్థించుకున్నాడు. పైగా ‘పాల్కురికి రచనే కదా! నీ గొప్పదనమేముంది?’ అని ఎవ్వరూ ఆక్షేపింపవద్దని అభ్యర్థించాడు. తామంతా ఆయన శిష్యులమే కావడం వల్ల గురువు మార్గంలోనే ఈ కావ్య నిర్మాణం జరిగిందన్న భావాన్ని తాను వ్యక్తీకరించాడు.
‘ప్రభులింగ లీలలు’
పిడుపర్తి సోమనాథుని మరొక రచన ‘ప్రభులింగ లీలలు’ అనే ద్విపద కావ్యం. ఇది అయిదు ఆశ్వాసాల కావ్యం. అల్లమ ప్రభువు గొప్పదనాన్ని కీర్తించే కావ్యమిది. శైవ సంప్రదాయ ప్రవర్తకులైన శివ కవులకు కన్నడభాషతో, కన్నడ సాహిత్యంతో విశేష పరిచయం ఉండడం మనకు సాహిత్య చరిత్రలో కనిపిస్తుంది. పాల్కురికి సోమన వంటి మహాకవులు కన్నడ భాషలోకూడా అపార సాహిత్య సృష్టి చేశారు. వీరశైవ ధర్మ ప్రచారకుడైన బసవేశ్వరుడు కన్నడ రాజ్యానికి చెందిన వాడు కావడం, పశ్చిమ చాళుక్యులు కన్నడ భాషా ప్రచారానికి ఎక్కువ ప్రాధా న్యం ఇవ్వడం కూడా దీనికి ఒక కారణమై ఉండవచ్చు. కన్నడ కవి చామరుసయ్య కన్నడంలో రచించిన ‘ప్రభులింగ లీలె’ కావ్యానికి ఇది అనువాదం.
బసవేశ్వరుని సమకాలీనుడు
కన్నడ కవి ‘భామినీ షట్పది’ ఛందస్సులో ఇరవై అయిదు గతులతో రచిం చిన ఈ రచనలోని వెయ్యిన్నూట పదకొండు పద్యాలే తెలుగులో ద్విపద కావ్యంగా రచింపబడ్డ ‘ప్రభులింగ లీలలు’ కావ్యానికి మూలమని సాహిత్య చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. వీరశైవ ప్రచారకుడైన బసవేశ్వరుడు ‘అను భవ మంటపము’ అనే పేరుతో ఒక వీరశైవ విద్యా పరిషత్తును ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతున్నది. దాని బాధ్యతలను నిర్వహించే నిమిత్తమై అల్లమ ప్రభువు ఆ పరిషత్తుకు అధ్యక్షునిగా నియమితులైనాడు.
ఈ అల్లమ ప్రభువును ‘ప్రభు దేవుడు’ అని కూడా వ్యవహరిస్తారు. ఈ ద్విపద కావ్యాన్ని పిడుపర్తి సోమనాథుడు సిద్ధ వీరేశ్వర గురువుకు అంకితం చేశాడు. చిఱుతొండనంబి వంశానికి చెందిన నెల్లూరి రామలింగయ్య ఆదేశం మేరకే ఆయన ఈ కృతిని సిద్ధ వీరేశ్వర గురువుకి అంకితమిచ్చినట్లు సాహిత్య చరిత్రకారులు నిర్ధారించారు. ఈ కావ్య కథా నాయకుడైన అల్లమ ప్రభువు బసవేశ్వరుని సమకాలీనుడని చరిత్రకారులు పేర్కొన్నారు. ఇందులో ఆయన పురాణ పాత్రగా చిత్రితమవడం విశేషం.
మృదు మధురమైన, సరళమైన శైలిలో పిడుపర్తి సోమన విరచితమైన ‘ప్రభులింగ లీలలు’ కావ్యంలో ‘సుజ్ఞాన’, ‘నిరహంకారుడు’, ‘మోహిని’, ‘మమకారుడు’ మొదలైన పాత్రలను గమని స్తుంటే అవి ‘ప్రబోధ చంద్రోదయము’ను తలపుకు తెస్తాయని ఆచార్య ఎస్.వి. రామారావు అభిప్రాయపడ్డారు. ఈ మా టలు ఆ కావ్య ప్రశస్తిని చాటుతున్నాయి.
పార్వతీ పరమేశ్వరుల సంవాదం
‘ప్రభులింగ లీలలు’ కావ్య కథ చిత్రమైంది. కథా నాయకుడైన అల్లమ ప్రభువు ఔన్నత్యాన్ని స్వయంగా పరమేశ్వరుడే పార్వతీ దేవికి చెబుతాడు. కాని, పార్వతీ దేవి ఆ విషయంలో పరమ శివుని అభిప్రాయంతో విభేదిస్తుంది.
“అల్లమ ప్రభువు అనేవాడు కూడా ఒక సామాన్య మానవుడేనని, మానవులు ఎవరైనా మాయాతీతులు కాలే రని” చెప్పడమేగాక “నేనే అతనిని మాయకు లోను జేసి వంచిస్తానని” పం తం పడుతుంది. భూలోకంలో మమకారుడు, మోహినీ అనే దంపతులకు మా య జన్మిస్తుంది. సంపూర్ణ యౌవన వతియైన పిదప మాయ.. అల్లమ ప్రభువును లోబరచుకోవడానికి పార్వతీ దేవి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. ఈ విషయాలను కవి విపుల రీతిలో వర్ణిస్తూ
“ఏకాంత గృహమున కెవ్వరి కెరుగ
రాక యుండగ నర్ధరాత్రంబునందు
అల్లమదెచ్చి శయ్యాస్థలి నునిచి
యల్లన దమ మాయనచటకు దెచ్చి
చెలులు చేతలపేరు చెప్పక జనిరి
తలుపు చేరుచుకొంచు దదంతరమున
మదన భూతముసోకి మాయ
యల్లమను గదిసిపైకొని
పొందగాబోవ నతడు
నీలమేఘంబులోని మెఱుగు
భాతి నాలోకనంబు సేయంగనే
గాని యాలింగనంబు సేయంగ
గన్నడుడు ఆకాశము విధాన
నలరుటేగానియేకమై రతికేళి మెనసి
యుండడు, బత్తితో నధరంబు
బట్టి బీల్చినను
రిత్తనోరే చప్పరించినట్లుండు,
కరము కరంబున గదియింప
బయలు పరికించి పట్టిన
భాతియైయుండు, నురమున
జన్మొనలొత్తిన బయలు
పరిరంభణము చేయు
పగిదియైయుండు, నీ రీతి
మాయ తానెంత చేసినను
మార విక్రియలల్లమకు లేకయుండె”
అంటూ అల్లమ ప్రభువులోని నిబద్ధతకు, నిలువెత్తు నిగ్రహానికి పెద్దపీట వేసి, ఆ ప్రభువు గొప్పదనాన్ని కవి చిత్రించాడు. పార్వతీదేవి మాయను ప్రయో గించి అల్లమ ప్రభువు నిష్ఠను, నియమాలను భగ్నం చెయ్యాలని ఎంత ప్రయత్నిం చినా ఆయన ఆమెకు లోబడలేదు. పర మ శివుని మాటల్లోని యధార్థాన్ని గ్రహించిన పార్వతీ దేవి తన ఓటమిని అంగీకరించింది.
అల్లమప్రభువుతో అక్కమహాదేవి వివాహం
పార్వతీదేవి తన సాత్విక నిర్మల కళను భూలోకానికి పంపి అల్లమ ప్రభువును సేవించుకొనమని నియమిస్తే, ఆయన భక్తికి వశుడవుతాడని పరమశివుడు చెప్పిన మాటలతో ఆమె తన సత్వభక్తిని అక్క మహాదేవిగా జన్మింప జేసింది. యౌవనవతి అయిన అక్కమహాదేవిని మండలేశ్వరుడు మోహించి వివాహమాడాలని సంకల్పిస్తాడు. అక్కమహాదేవి దానిని తిరస్కరించింది. తన జన్మ పరమశివుని కోసమేనని చెప్పింది. కానీ, ఆమె చేసిన ఆ పరమేశ్వరుని అన్వేషణలోనే అల్లమ ప్రభువు ఘనతను తెలుసుకొంది. ఆయన శివభక్తి
పారమ్యానికి అబ్బుర పడింది. అందుకే, అతనిని భర్తగా అంగీకరించింది. అంటే, ఆ ప్రభువు సాక్షాత్తు శివ స్వరూపుడేనని కవి భావించినట్లు అర్థమవుతున్నది. ఆ తర్వాత బసవేశ్వరుడు ఈ అల్లమ ప్రభువును అనుభవ మంటపంలో నిలుపుతాడు. ఆ ప్రభువు లీలల వర్ణనయే ఈ ‘ప్రభులింగ లీలలు’ కావ్యం. రెండు కావ్యాల గద్యలలో ‘ప్రబంధ నిబంధ శక్తియుక్తుడ’నని పిడుపర్తి సోమనాథుడు చెప్పుకొన్నాడు. దీనికి ఆయన రచించిన పై రెండు రచనలే ప్రమాణాలు. ప్రత్యేకంగా స్వతంత్ర రచనలేవీ సోమనాథుడు చేయక పోయినా, చేయగలిగే సమర్థుడని మాత్రం చెప్పక తప్పదు.