calender_icon.png 23 December, 2024 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పచ్చడి మెతుకులే దిక్కు

09-09-2024 12:04:26 AM

  1. ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు 
  2. వరుస వర్షాలతో దెబ్బతింటున్న పంట 
  3. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేయిస్తున్న వ్యాపారులు 
  4. దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్‌లో పెరిగిన ధరలు 
  5. సామాన్యుడు బె‘ధర’హో..!

సంగారెడ్డి, సెప్టెంబర్ 8 (విజయక్రాంతి): భారీ వర్షాలతో పంటలు దెబ్బతినడంతో మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో పేద, మధ్యతరగతి ప్రజ లు పచ్చడి మెతుకులతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి. సంగారెడ్డి జిల్లాలో సుమారు వారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కూరగాయల పంటలు వరద పాలయ్యాయి. సంగా రెడ్డి, పటాన్‌చెరు, ఆందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాల్లో  పంట నష్టం తీవ్రత ఎక్కువగా ఉంది.

జూన్‌లో వర్షాలు లేకపోవడంతో రైతులు ఎక్కువగా కూరగాయలు సాగు చేయలేదు. ఇప్పుడు పండిస్తు న్నప్పటికీ భారీ వర్షాలతో  పంట దెబ్బతిన్నది. రైతులు చేతికందిన కొద్ది పంటను కాపాడుతున్నారు. వ్యాపారులు అతి కష్టం మీద మార్కెట్‌కు కూరగాయలు తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్‌లో కిలో టమాటా కిలో రూ. 50, పచ్చిమిర్చి రూ.120, కొత్తిమీర కిలో రూ.300 పలుకుతోంది.

మహారాష్ట్ర, కర్ణాటక నుంచి దిగుమతి

జిల్లాకు చెందిన వ్యాపారులు ప్రతి రోజు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూరగాయలు దిగుమతి చేసుకుంటున్నారు. రవాణా ఖర్చు లు పెరిగిపోవడంతో కూరగాయల ధరలు కూడా పెరిగాయి. గతంలో జిల్లాలో పండించిన పచ్చిమిర్చితో పాటు ఇతర ప్రాంతాల నుంచి మిర్చి రావడంతో ధరలు అందుబాటులో ఉండే వి. కానీ ఇప్పుడు భారీ వర్షాలు కురవడంతో పాటు పచ్చిమిర్చి పంట దెబ్బతిన్నది. సాగు కూడా తగ్గిపోవడంతో ధరలు పెరిగిపోతున్నాయి. జిల్లాలోని జహీరాబాద్ కూరగాయల మార్కెట్‌కు ప్రతిరోజు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 10 నుంచి 20 మినీ వాహనాల్లో కూరగాయలు వచ్చేవి.

భారీ వర్షాలతో రైతులు పొలాకు వెళ్లడం లేదు. ప్రస్తుతం మార్కెట్‌కు కనీసం 10 మినీ వాహనాల్లోనైనా కూరగాయలు రావడం లేదని వ్యాపారులు చెప్తున్నారు. జహీరాబాద్ కూరగాయల మార్కెట్ నుంచి సదాశివపేట, సంగారెడ్డి, పటాన్‌చెరు, హైదరాబాద్ మార్కెట్‌కు వ్యాపారులు కూరగా యలు తరలిస్తారు. హోల్ సేల్ మార్కెట్‌లో కూరగాయలు కొనుగోలు చేసేందుకు వ్యాపారులు పోటీపడ డంతో ధరలు పెరిగిపోతున్నాయి. వర్షాలు తగ్గినా కూర గాయల ధరలు తగ్గే పరిస్థితి కనిపించడం లేదని వ్యాపారులు తెలుపుతున్నారు. 

భారీ వర్షాలతో నష్టం

భారీ వర్షాల వల్ల కూరగాయల పంటల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో పంట మురిగిపోతోంది. మొక్కలు నీళ్లలో నాని చచ్చిపోతున్నాయి. రైతులు మిగిలిన పంటలను పండించేందుకు విశ్వప్రయత్నాలు చేసప్తున్నారు. విరివిగా రసాయన మందులు పిచికారీ చేస్తున్నారు. పంటలో నిలిచిన వరద నీటిని తొలగిస్తున్నారు. వానలతో కొన్నిచోట్ల దిగుబడి కూడా అమాంతంగా తగ్గిపోయింది.