calender_icon.png 15 November, 2024 | 11:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పక్కా ప్రణాళికతోనే భౌతికదాడులు

12-11-2024 12:05:12 AM

  1. దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నాం
  2. వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదు
  3. మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ

వికారాబాద్, నవంబర్ 11 (విజయక్రాం తి): దుద్యాల మండలం లగచర్లలో పక్కా ప్రణాళికతోనే కలెక్టర్ ప్రతీక్ జైన్, కడా ప్రత్యేకాధికారి వెంకరెడ్డితో పాటు ఇతర అధికారు లపై దాడులు జరిగాయని,దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామని, దాడుల వెనుక ఉన్నవారిని వదిలిపెట్టేది లేదని మల్టీజోన్  ఐజీ సత్యనారాయణ స్పష్టం చేశారు.

వికారాబాద్‌లోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ అధికారులపై దాడులు చేయడం చట్టరీత్య తీవ్రమైన నేరమవుతుందన్నారు. సుమారు 150 నుంచి 160 మంది కలిసి వారిపై దాడి చేశారని వెల్లడించారు. దాడులపై ఇప్పటికే మూడు ఎఫ్‌ఐఆర్‌లు నమో దు చేశామని, 15 మందిని అదుపులోకి తీసుకున్నామని స్పష్టం చేశారు.

ఇప్పటికే నిందితుల మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, వాటిని పరిశీలించి వారు ఎవరెవ రికి కాల్ చేశారు, వారి వెనుక ఎవరున్నారనే విషయం తెలుసుకుంటామన్నారు. గతంలో రెండు, మూడు సార్లు ఇలాంటి ఘటనలే జరిగాయని, అయినా రైతులకు సంబంధించిన సున్నితమైన విషయం కావడంతో పోలీసు శాఖ సంయమనం పాటించిందన్నారు. అధికారులపై దాడులను తీవ్రంగా పరిగణిస్తున్నామన్నారు.

విధుల బహిష్కరణ వద్దు: కలెక్టర్

తనతో పాటు ఇతర అధికారులపై జరిగిన దాడిని ఖండిస్తూ వికారాబాద్ కలెక్టరేట్ సిబ్బంది మంగళవారం విధుల బహిష్కరణ కార్యక్రమానికి పిలపునివ్వడంపై కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందిచారు. సోమవారం జరిగిన దాడి రైతులు కావాలని చేయలేదని.. ఉద్యోగులెవరూ విధులు బహిష్కరించవద్దని కలెక్టర్ సూచించారు.

కాగా కలెక్టర్, అధికారులపై దాడి ఘటనను నిరసిస్తూ సోమవారం కలెక్టరేట్ సిబ్బంది విధులను బహిష్కరించి పెన్‌డౌన్ చేశారు. కలెక్టరేట్ ఎదుట నిరసనకు దిగారు. అలాగే దాడిని ఖండిస్తున్నట్లు రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.