- ఒక్క ఫొటో వంద అర్థాలను తెలియజేస్తుంది
- మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
ముషీరాబాద్, అక్టోబర్ 22: ఫొటోగ్రఫీ చరిత్రకు సాక్ష్యమని, ఒక్క ఫొటో వంద అర్థాలను తెలియజేస్తుందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు సుంకిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌కే హుస్సేన్, ప్రధాన కార్యదర్శి లడె రవి (సిరి రవి), కోశాధికారి భీమిడి మాధవరెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఫొటో, వీడియోగ్రాఫర్లకు ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని, ఏ సమస్య వచ్చినా నేరుగా ముఖ్యమంత్రిని కానీ, తనను కానీ సంప్రదించాలని అన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్, సంఘం ప్రతినిధులు రవీందర్, నాగరాజు, ఫొటో, వీడియోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.