calender_icon.png 16 November, 2024 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Phones claiming to be involved in money laundering

16-11-2024 12:44:13 AM

  1. మనీలాండరింగ్‌కు పాల్పడ్డారంటూ ఫోన్లు 
  2. డిజిటల్ అరెస్టయ్యారంటూ బెదిరింపులు 
  3. విచారణ పేరుతో నగదు బదిలీ చేయించుకుంటున్న వైనం
  4. అప్రమత్తత అవసరమంటున్న సైబర్‌క్రైమ్ పోలీసులు

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అడ్డుఅదుపూ లేకుండా పోతోంది. ముఖ్యం గా వృద్ధులను లక్ష్యంగా చేసుకొని వారిపై సైబర్ పంజా విసురుతున్నారు. పలు బీమా సంస్థల నుంచి వృద్ధుల ఫోన్ నంబర్లు సేకరిస్తున్న సైబర్ నేరగాళ్లు వారికి పోలీసు, సీబీఐ, కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్లు చేసి, మాయమాటలతో అందినంతా దోచుకుంటున్నారు.

ముఖ్యంగా ‘మీపై మనీలాం డరింగ్ కేసు నమోదైందని, మిమ్మల్ని డిజిటల్ అరెస్ట్ చేశామంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అనంతరం విచారణ పేరుతో బాధితుల బ్యాంక్ ఖాతా, ఎఫ్‌డీల వివరాలు సేకరించి కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో సైబర్ క్రైమ్స్ పట్ల సీనియర్ సిటిజన్స్ అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ పేర్కొంటున్నారు.

ఒక్క క్లిక్‌తో స్వాహా..

వృద్ధాప్యంలో అవసరాల కోసం జీవితాంతం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్మును సైబర్ నేరగాళ్లు ఒక్క క్లిక్‌తో కాజేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. వృద్ధాప్యం లో తమ పిల్లలు పట్టించుకోకపోయినా, అనారోగ్య సమస్యల బారినా పడిన అత్యవసర సమయాల్లో అక్కరకు వస్తుందని దాచుకున్న డబ్బును స్వాహా చేస్తున్నారు. ముఖ్యం గా వృద్ధుల భయం, అత్యాశను సైబర్ నేరగాళ్లు అవకాశంగా మలుచుకుంటున్నారు.

మోసపోతున్న వారి లో ఉన్నత విద్యావంతులు ఎక్కువగా ఉంటున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొంటున్నారు. అపరిచితులెవరు ఫోన్ చేసినా భయపడకుండా వెంటనే డయల్ 100కి కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ పోలీసులు ఫోన్లు చేసి నగదు బదిలీ చేయాలని అడగరని స్పష్టం చేశారు. 

తస్మాత్త్ జాగ్రత్త!

* ఈమధ్య కాలంలో ఎక్కువగా వృద్ధులకు పోలీసు, సీబీఐ, కస్టమ్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికార్ల ముసుగులో, యూని ఫామ్స్ ధరించి వీడియో కాల్స్ చేసి, డిజిటల్ అరెస్ట్ చేశామంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. అలా ఎవరైనా ఫోన్లు చేస్తే అస్సలు నమ్మకండి.. అది మోసగాళ్లు చేసిన ఫోన్లు అని గ్రహించి, వెంటనే డయల్ 100, 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.  

* స్టాక్, క్రిప్టో, ఫోరెక్స్ వంటి వాటిలో పెట్టుబడి పెడితే అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వస్తాయంటూ సైబర్ నేరగాళ్లు ఫోన్లుచేసి మాయమాటలు చెబుతారు. అలా ఎవరికీ తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో లాభాలు ఇవ్వడం సాధ్యం కాదు. మీ ఆశను వారు అవకాశంగా మలుచుకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలి. 

* మీ ప్రొఫైల్ ఫొటోలను దొంగలించి, వాటిని దుర్వినియోగం చేయడం ద్వారా మీ పరిచయస్తులకు ఫోన్లు, మేసేజ్‌లు చేసి ఆర్థికంగా లబ్ధి పొందు తున్నా రు. కాబట్టి, ఎవరైనా అలా ఫోన్లు చేస్తే ముందుగా ఎవరు? ఏంటి? అని తెలుసుకొని సహాయం చేయండి. అంతే కానీ, మనకు తెలిసిన వారే కదా అని ఎవరికి పడితే వారికి నగదు బదిలీ చేస్తే అనంతరం మీరే బాధపడాల్సి వస్తుంది. 

* ఆకర్షణీయమైన పాలసీల పేరుతో.. నకిలీ ఇన్సూరెన్స్ ఏజెంట్ల ముసుగులో మీ వ్యక్తిగత సమాచారాన్ని రాబట్టి సైబర్ దాడులకు పాల్పడుతున్నారు. ఇన్సూరెన్స్ టాప్ అప్ అంటూ ఓటీపీలు పంపి, ఖాతాల్లో నగదు మాయం చేస్తున్నారు. ఒకవేళ మీరు బీమా ఇన్సూరెన్స్ చేయాలనుకుంటే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సలహా మేరకు, కంపెనీ, ఏజెంట్ వివరాలను నిశితంగా పరిశీలించి బీమా ఇన్సూరెన్స్ చేయించుకోండి. 

* కొరియర్ కంపెనీ ఉద్యోగులుగా, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులుగా నటిస్తూ మీ పార్సిల్స్‌లో డ్రగ్స్ ఉన్నాయని బెదిరిస్తూ, విచారణకకు సహకరించాలని, లేకపోతే అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు. ఆర్బీఐ, సీబీఐ పేర్లతో నకిలీ అరెస్ట్ లేఖలు సృష్టించి, నగదు బదిలీ పేరుతో మీ ఖాతాలు ఖాళీ చేస్తారు. 

భయభ్రాంతులకు గురికావొద్దు

సీనియర్ సిటిజన్స్‌కు ఎవరైనా ఫోన్లు చేసి ఇలాంటి మోసాలకు పాల్పడితే భయభ్రాంతులకు గురికావొద్దు. ఎవరైనా ఫోన్లు చేసి బెదిరింపులకు పాల్పడినా.. ఒకవేళ సైబర్ మోసగాళ్ల చేతిలో మోసపోయామని గ్రహించినా.. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయండి. డయల్ 1930, వాట్సాప్ నంబర్ 8712672222, వెబ్‌సైట్ cybercrime.gov.in లో ఫిర్యాదులు చేయొచ్చు.

 శిఖా గోయల్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్